అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టాలని ఆ ఇద్దరూ.. ఏడోసారి గెలిచి తమ తడాఖా చూపించాలని వాళ్లిద్దరు.. ఎవరికి వారే తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పోటా పోటీ ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో.. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. మరి.. ఎవరి కోరిక నెరవేరుతుంది ? ఆ రెండు స్థానాల్లో గెలిచేదెవరు ? ఓటమి ఎవర్ని పలకరించబోతోంది ? ఆయా నియోజకవర్గాల్లో ఇప్పుడిదే చర్చ.
ఇప్పుడు చెప్పుకున్నదంతా ఈ రెండు నియోజకవర్గాల గురించే. ఒకటి పాలకుర్తి, మరోటి డోర్నకల్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత కీలక స్థానాలుగా గుర్తింపు పొందాయి ఈ రెండు నియోజకవర్గాలు.
మొదటగా పాలకుర్తి నియోజకవర్గంలోని పరిస్థితి గమనిస్తే… ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధించారు. 1994, 1999, 2004లో వర్థన్నపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఎర్రబెల్లి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగారు. అయితే..నియోజక వర్గాల పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పాటైన పాలకుర్తికి మారారు. 2009, 2014లో విజయం సాధించి డబుల్ హ్యాట్రిక్‌కు బాటలు వేసుకున్నారు. అయితే..2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారాయన.
ఇక, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జంగా రాఘవరెడ్డిపై బంపర్ విక్టరీ కొట్టారు. డబుల్ హ్యాట్రిక్ సాధించారు. దీంతో ఆరుసార్లు నెగ్గిన ఎర్రబెల్లికి కేసీఆర్ కేబినెట్‌లో చోటు దక్కింది. అంతే..నియోజకవర్గంపై మరింత తిరుగులేని పట్టు సాధించారు ఎర్రబెల్లి. ఒకానొక దశలో ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్‌కు కనీసం అభ్యర్థి కూడా లేరన్న ప్రచారం జోరుగా సాగింది.
పాలకుర్తిలో ఈసారి కూడా గెలుపు ఎర్రబెల్లిదేనని.. విజయం నల్లేరుపై నడకేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న వేళ.. నియోజకవర్గంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. అమెరికాలో నివాసం ఉంటున్న పాలకుర్తికి చెందిన ఎన్‌ఆర్‌ఐ ఝాన్సీరెడ్డి తెరమీదకు వచ్చారు. దీంతో.. కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం మొదలైంది. అయితే.. ఆమె పౌరసత్వం సమస్య రావడంతో వెంటనే ఆమె కోడలు యశస్వినీరెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.
వయసులో చాలా చిన్న అయినప్పటికీ తనకున్న అనుభవాన్నంతా రంగరించి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు యశస్వినీ రెడ్డి. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను కలుపుకుపోవడంతోపాటు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనను ఎక్కడికక్కడ ఎండగడుతూ ఊరు వాడా తిరుగుతున్నారు. దీనికితోడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాము చేయబోయే కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు యశస్వినీరెడ్డి.
మరోవైపు..రిజర్వ్ స్థానమైన డోర్నకల్‌లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇక్కడి నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్.. కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రు నాయక్‌తో తలపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరంగేట్రం చేసిన రెడ్యానాయక్ ఒకసారి టీడీపీ హవాలో ప్రస్తుత మంత్రి సత్యవతి రాథోడ్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి వరుసగా గెలుస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో గెలుపొంది ఏడోసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు రెడ్యానాయక్.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రునాయక్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది రెడ్యానాయక్‌కు. 2018లోనూ వీరిద్దరే తలపడినా అప్పుడు రెడ్యానాయక్ గెలిచారు. దీంతో నాటి సానుభూతికితోడు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ హవా వీస్తోందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్న నేపథ్యంలో అది తనకు కలిసి వస్తుందని.. గెలుపు వరిస్తుందని రామచంద్రునాయక్ గట్టి నమ్మకంతో ఉన్నారు. దీంతో..ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారాయన. ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రు నాయక్ దూకుడు మీద ఉండడంతో.. ఆయన పరుగులకు బ్రేక్ వేసేందుకు రెడ్యానాయక్ గట్టిగా శ్రమించాల్సి వస్తోందన్న టాక్ నడుస్తోంది. దీనికితోడు సహజంగానే వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత రెడ్యానాయక్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందన్న వాదనా విన్పిస్తోంది. అందుకే రెడ్యానాయక్ తన అనుభవనాన్నంతా కూడగట్టుకొని మరీ రామచంద్రు నాయక్‌పై పోరాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరి.. రాబోయే ఎన్నికల్లో పాలకుర్తి, డోర్నకల్‌లో బీఆర్‌ఎస్ మరోసారి గెలుస్తుందా లేక కాంగ్రెస్ అభ్యర్థులు అసెంబ్లీలో అడుగు పెడతారా అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.