ఎండాకాలం రావడంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. మధ్యాహ్నం వేళ అయితే అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. ఎండల పెరుగుదలతో శీతల పానీయాలు తాగుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో బీర్ల అమ్మకాలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే మందుబాబులు ఎండ వేడిమి తట్టుకోలేక బీర్లు తెగ తాగేస్తున్నారు.
ఏప్రిల్ 1నుంచి 17వరకు నగరంలో ఏకంగా 1.01కోట్ల బీర్లుతాగేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రోజుకు సగటున 6లక్షల బీర్లు అమ్ముడవుతున్నట్లు అబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. ఈ మూడు జిల్లాల్లో కలిపి ఈనెల 17వరకు 8,46,175 కేసుల బీర్లు అమ్ముడుపోయాయన్నారు. ఎండలతో మార్చి నుంచే బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయని పేర్కొన్నారు.