తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన వరదల వల్ల నష్టపోయిన బాధితుల సహాయార్ధం ఇప్పటికే ఎందరో సినీ, ఇతర రంగాల ప్రముఖులు అండగా నిలిచారు. ఇప్పుడు ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ తరఫున పాతిక లక్షల విరాళం అందజేశారు. ఎఫ్ఎన్‌సీసీ అధ్యక్షుడు ఆదిశేషగిరిరావు, సెక్రెటరీ ముళ్లపూడి మోహన్, జాయింట్ సెక్రటరీ పెద్దిరాజు.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుని కలిసి 25 లక్షల రూపాయల చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతిసారి ఎఫ్‌ఎన్‌సీసీ క్లబ్ సహాయ కార్యక్రమాలలో ముందుంటుందని తెలిపారు.
సెక్రెటరీ మోహన్ ముళ్ళపూడి మాట్లాడుతూ ‘‘ఆంధ్రప్రదేశ్లో గాని, తెలంగాణలో గాని ఎలాంటి విపత్తు వచ్చినా ఎఫ్‌ఎన్‌సీసీ తరఫున గతంలోనూ సహాయం చేశాం. ఇప్పుడు, ఎప్పుడు చేయడానికి ముందుంటాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి 25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి 25 లక్షలు విరాళం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫిలింనగర్ క్లబ్‌కి చాలా అండగా నిలబడుతున్నాయి. అందుకుగాను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.’’ అన్నారు.