స్వతంత్ర వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను అగ్రరాజ్యం అమెరికాలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నారై తెలుగుదేశం అమెరికా కో-ఆర్డినేటర్ జయరాం కోమటి నేతృత్వంలో ‘ఎన్టీఆర్’ చిత్రమాలికను ‘టైమ్ స్క్వేర్’లో ప్రకటన రూపంలో డిస్‌ప్లే చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 200 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పుతో ఉండే ఈ డిస్‌ప్లేను ఈ నెల 27 అర్ధరాత్రి నుంచి 28వ తేదీ అర్ధరాత్రి వరకు ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రతి 4 నిమిషాలకు ఒకసారి 15 సెకన్ల చొప్పున ఎన్టీఆర్‌కు సంబంధించిన విభిన్న చిత్రాలను ప్రకటన ద్వారా ప్రసారం చేయనున్నట్లు వివరించారు. ప్రపంచంలోని ఎన్టీఆర్ అభిమానులంతా దీన్ని చూసేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎన్నారై తెలుగుదేశం నాయకురాలు విద్య గారపాటి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ డిస్‌ప్లే ప్రకటన ద్వారా యుగ పురుషుడి ఖ్యాతి విదేశాల్లో మరింత ప్రాచుర్యంలోకి రానుందని ఎన్నారై టీడీపీ నాయకులు చెప్పారు.