కరోనా, కోర్టు కేసులు, ఇతర పరిస్థితుల నేపథ్యంలో నూతన సచివాలయ భవన సముదాయ నిర్మాణ పనులు 2021 జనవరిలో ప్రారంభమయ్యాయి. 28 ఎకరాల్లోని విశాల స్థలంలోని 7,79,982 చదరపు అడుగులు విస్తీర్ణంలో 265 అడుగుల ఎత్తుతో ఈ భవనం నిర్మించబడింది. ఇంత ఎత్తైన సచివాలయం ఏ రాష్ట్రంలోనూ లేదు. దేశంలోని అతిపెద్ద సచివాలయాల్లో ఇదీ ఒకటి. భవనం పైన ఏర్పాటుచేసిన సౌర ఫలకాలతో సచివాలయంలో వినియోగించే దీపాలకు అవసరమైన విద్యుత్తును సోలార్ పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్నారు. పనులు మొదలయ్యాక 26 నెలల రికార్డు సమయంలో సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇంత భారీ నిర్మాణానికి సాధారణంగా ఐదేళ్ళైనా పడుతుంది. సచివాలయంలోకి ప్రవేశానికి స్మార్ట్ కార్డ్ తో కూడిన పాస్ లు జారీ చేశారు. 300 సీసీ కెమెరాలు, 300 మంది పోలీసులతో నిఘా ఏర్పరిచారు.
కొత్త భవనంలో అత్యుత్తమ సాంకేతికత వినియోగించడం ద్వారా పాలన ఆన్ లైన్ కానుంది. డోమ్ లు, పిల్లర్ల నిర్మాణం కోసం గాల్వనైజ్డ్ రీఇన్ఫోర్స్ కాంక్రీట్ (జీఆర్ సీ) టెక్నాలజీని వినియోగించారు. ఈ విధానంలో పిల్లర్ల తయారీకే 6 నెలల సమయం పట్టింది. రోజూ 3 వేల మందికి పైగా కార్మికులు పనిచేశారు. మొత్తం 1000 లారీల రెడ్ శాండ్ స్టోన్ వినియోగించారు. భవన నిర్మాణానికి రూ.617 కోట్ల మేర పరిపాలన అనుమతులు వచ్చాయి. ఇప్పటి వరకు రూ.550 కోట్ల వరకు ఖర్చు చేశారు. అనుకున్న దానికంటే 20-30 శాతం వ్యయం పెరిగింది. ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ పర్యవేక్షించడం, అన్ని పనులు ఒకే నిర్మాణ సంస్థకు అప్పగించడం వల్ల త్వరగా పూర్త చేయగలిగారు.
నూతన సచివాయంలో 635 గదులు.. 30 సమావేశ మందిరాలు.. 34 గుమ్మటాలు ఉన్నాయి. సచివాలయ ప్రధాన భవనం ఆరు అంతస్తుల్లో ఉంటుంది. ప్రధాన గుమ్మటం వద్ద మరో ఐదు అంతస్తులతో 11 అంతస్తుల నిర్మాణంగా ఉంటుంది. ముందువైపు 10 ఎకరాల్లో పచ్చిక మైదానం ఉండగా, కోర్ట్ యార్డులో 2 ఎకరాల్లో లాన్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టా కన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. భవన నిర్మాణానికి రూ.617 కోట్లకు పరిపాలన అనుమతులిచ్చారు. అప్పట్లో 6 శాతంగా ఉన్న జీఎస్టీ తర్వాత 18 శాతానికి పెరిగింది. నిర్మాణ సామాగ్రి పనులు పెరిగాయి. దీంతో నిర్మాణ వ్యయం దాదాపు 30 శాతానికి పైగా పెరిగింది. ఆరో అంతస్తులోని సీఎంవోకు చేరుకునేందుకు రెండు లిప్టులు ఏర్పాటు చేశారు. మంత్రులు, ఆ స్థాయి వారి కోసం 24 చాంబర్లను రూపొందించారు. మంత్రి, కార్యదర్శి, ఆ శాఖ అధికారులంతా ఒకేచోట ఉండేలా ఏర్పాటు చేశారు. ఇలాంటి వ్యవస్థ ఉన్న సచివాలయం దేశంలో ఇదొక్కటే కావడం విశేషం. విదేశీ ప్రతినిధులు, ఇతర అతి ముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు హై టీ, రాయల్ డిన్నర్ లకు వినియోగిస్తారు. అక్కడి నుంచి నగర అందాలు 360 డిగ్రీల కోణంలో వీక్షించోచ్చు. ఈ ప్రాంతాన్ని స్కై లాంజ్ గా వ్యవహరిస్తారు.
పార్లమెంటు భవనానికి వినియోగించిన ధోల్ పూర్ ఎర్రరాయిని సచివాలయం కోసం 3,500 క్యూ.మీ. పరిమాణంలో వాడారు. ఇందుకు రాజస్థాన్ లోని ధోల్ పూర్ లో ఏకంగా ఓ గని మొత్తాన్ని వినియోగించారు. అక్కడి నుంచి వేయి లారీల్లో రాయిని హైదరాబాద్ కు తరలించారు. బేస్ మెంట్ మొత్తానికి ఎర్ర రాయిని వాడగా, ప్రధాన గుమ్మటం నుంచి పోర్టికో వరకు లేత గోధుమ రంగు రాయిని వాడారు. స్తంభాలు ఇతర భాగాల్లో ప్రత్యేక నగిషీ ఆకృతుల కోసం గాల్వనైజ్డ్ రీ ఇన్ ఫోర్స్ డ్ కాంక్రీట్ పద్ధతిలో ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ డెకొరేషన్ చేయించారు. తద్వారా దేశంలో ఈ స్థాయిలో జీఆర్ సీ చేసిన తొలి భవనంగా సచివాలయం నిలిచింది. ప్రధాన పోర్టికో ఎత్తు ఏకంగా 42 అడుగులు. అంత ఎత్తుతో భారీ స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ భవనంలో ప్రతి అంతస్తు 14 అడుగుల ఎత్తుతో నిర్మించారు.


