ఆ జిల్లాల్లో ఆ మంత్రి సమీక్ష సమావేశాలకు హాజరు కావడం లేదు. ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కావస్తున్నా కలెక్టర్ కార్యాలయం వైపు కన్నెత్తి చూడటంలేదు.. అధికారం కోసం పాదయాత్ర చేసిన ఆ మంత్రి ఎందుకు రావడం లేదు? రాష్ట్రంలో ప్రాధాన్యత గల ఆ జిల్లాల్లో సమావేశాలకు మంత్రి రాకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి?
రాష్ట్రంలో గుంటూరు జిల్లా అంటేనే రాజకియ ఖిల్లాగా పేరు ప్రఖ్యాతలు గాంచినది. అలాంటి జిల్లాలో ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణాలు కీలక మలుపులు తిరుగుతుంటాయి. దీంతో పాటు విద్య, వ్యవసాయం, వ్యాపార రంగానికి అనువుగా ఉండే జిల్లాగా ప్రాచుర్యం పొందింది. అలాంటి పేరు పొందిన జిల్లాల్లో ప్రభుత్వం ఏర్పడి 8 నెలల కాలంలో జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు, జిల్లా అభివృద్ధి సమావేశాలను అధికారులే నిర్వహిస్తున్నారు. జిల్లా అభివృద్ధి సమావేశాలకు మంత్రి నారా లోకేష్ రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గుంటూరు జిల్లా సమీక్షలకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్, ఇంచార్జి మంత్రి దుర్గేశ్, మంత్రి నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్లు సైతం సమీక్షలకు హాజరయ్యి అధికారులతో అభివృద్ధిపై చర్చ చేస్తున్నారు. సీఎం చంద్ర బాబు నాయుడు తనయుడు కావడంతో లోకేష్‌ను సమీక్షలకు రావాలని ధైర్యంగా అడగలేకపోతున్నారనే టాక్ వినిపిస్తుంది.
ఇది ఇలా ఉంటే మరోవైపు మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలకు మంత్రి హోదాలో విచ్చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యేలను మాత్రమే లోకేశ్ కలిశారు. కానీ కింది స్థాయి నేతలను మాత్రం కలవలేదు. లోకేష్ పాదయాత్ర చేస్తున్న సమయంలో.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తప్పని సరిగా అందరినీ కలుస్తా అని హామీ ఇచ్చారని.. ఇప్పుడు కనీసం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయం వైపు కూడా కన్నెత్తి చూడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా దర్బార్ పేరుతో మంత్రి లోకేష్ సొంత నియోజకవర్గమైన మంగళగిరికి పరిమితం అవుతున్నారు. అక్కడే ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు తప్ప.. గుంటూరుకు మాత్రం రావడం లేదని కూటమి నేతలు ఆవేదన చెందుతున్నారు. అయితే విద్యా శాఖ మంత్రిగా బిజీగా ఉండటం వల్లే లోకేశ్ సమీక్షలకు హాజరు కావడం లేదని ఇంచార్జి మంత్రి కందుల దుర్గేశ్ చెబుతున్నారు. మంత్రి తరపున ఎమ్మెల్సీ అనురాధ పాల్గొంటున్నారని అంటున్నారు.
గుంటూరు జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య వర్గ పోరు కొనసాగుతుంది. మంత్రి లోకేష్ వస్తే తమ సమస్యలు.. తమ బాధలు చెప్పుకుంటే పరిష్కారం అవుతాయని కింది స్థాయి నేతలు కార్యకర్తలు భావిస్తున్నారు. గుంటూరు జిల్లాను మరెంతో వన్నె తెచ్చే విధంగా.. ప్రముఖ ప్రాంతాలు గుర్తించి.. అభివృద్ధి చేసే దిశగా అధికారులు సూచనలు చేసే అవకాశం ఉంది. కానీ మంత్రి లోకేష్ బాబు రాకపోవడం.. సమీక్షలకు హాజరు కాకపోవడంపై జిల్లాలో కింది స్థాయి నేతల్లో, కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది.
ఏది ఏమైనా మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా స్థాయి సమీక్షలు, సమావేశాలకు హాజరయితే జిల్లా మరింత అభివృద్ధి చెందుతుంది. లేకుంటే మాత్రం జిల్లాల్లో కూటమి నేతలు మధ్య వర్గ పోరు కొనసాగి నేతల్లో చీలికలు వచ్చే ప్రమాదం ఉంది.. మరి దీనిపై మంత్రి లోకేష్ ఏమి చేస్తారో వేచి చూద్దాం..