డిసెంబర్ 31 అర్ధరాత్రి తాడిపత్రిలో న్యూ ఇయర్ వేడుకల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ మహిళా నాయకురాలు మాధవీలత మధ్య పంచాయితీ ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదువ్వగా.. తాజాగా సినీనటి మాధవీలతపై అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
డిసెంబర్ 31న తాడపత్రి జేసీ పార్కులో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కొంకరి కమలమ్మ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ సాయి ప్రసాద్ వివరాలు తెలిపారు.
అసలేం జరిగింది?
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జేసీ పార్క్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. అయితే ఆ వేడుకలకు వెళ్లవద్దని.. మహిళలకు రక్షణ ఉండదని మాధవీలత ఒక వీడియో రిలీజ్ చేశారు. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మాధవీలత ఒక సినిమా యాక్టర్ అని.. యాక్టర్స్ అంతా ప్రాస్టిట్యూట్స్‌నే అని పరుష పదజాలంతో విమర్శించారు. జేసీ చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. దీనిపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. దీంతో వెనక్కి తగ్గిన జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు.
తాను వయసు మీద పడడంతో ఆవేశంలో అలా మాట్లాడానే తప్ప ఎవరినీ కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడలేదని వివరించారు. మాధవీలతపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. మాధవీలతను క్షమాపణలు కోరారు. ఈ వివాదం ఇంతటితో ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ మాధవీలత జేసీని క్షమించలేదు. అప్పట్లోనే ఆమె ఓ వీడియో రిలీజ్ చేశారు. అనంతరం సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది.