– తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం?
– జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రకటించే చాన్స్
– ఏపీ అధ్యక్షుడి మార్పుపైనా ఊహాగానాలు
– తెలంగాణలో సంజయ్‌ను కొనసాగించే అవకాశం
– గత సీనియర్ల భేటీలో స్పష్టం చేసిన సంతోష్‌జీ?
– కేరళ, బిహార్, ఏపీ, రాజస్థాన్ అధ్యక్షుల మార్పు
– సంఘ్ నుంచి మళ్లీ బీజేపీకిలోకి కీలక నేతలు?
( మార్తి సుబ్రహ్మణ్యం)
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జెపి నద్దాను తిరిగి కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ, కొన్ని రాష్ర్టాల్లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, తిరిగి ఆయననే తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు నేటి నుంచి రెండురోజుల పాటు, ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
బీజేపీ తాత్కాలిక జాతీయ అధ్యక్షుడిగా జెపి నద్దాను కొనసాగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలుత తన సొంత హిమాచల్‌ప్రదేశ్‌లో పార్టీ ఓటమి పాలయినందున, నద్దాను అధ్యక్షుడిగా తొలగిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు అధ్యక్షుడిని మారిస్తే.. కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నందున, నద్దానే తాత్కాలిక అద్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉందంటున్నారు. అందుకే పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు ఈ ఏడాది చేపట్టలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నద్దా హయాంలో అనేక రాష్ర్టాల్లో బీజేపీ ఘన విజయం సాధించినప్పటికీ, తన సొంత రాష్ట్రంలో మాత్రం, పార్టీని విజయతీరాలకు చేర్చడంలో ఆయన విఫలమయ్యారన్న విమర్శలు పార్టీ వర్గాల్లో లేకపోలేదు. కాగా ఏపీ, బిహార్, రాజస్థాన్, కేరళ రాష్ర్టాల పార్టీ అధ్యక్షులను మార్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీటిలో ఏపీ, బిహార్, రాజస్థాన్‌కి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇక కేరళ అధ్యక్షుడిపై ఆరోపణల దృష్ట్యా, ఆయనను కూడా మార్చవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల సమయంలో ఆయనపై నిధుల దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వచ్చాయి.
అయితే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ను మార్చాలన్న డిమాండ్, సీనియర్ల నుంచి చాలాకాలం నుంచి వినిపిస్తోంది. ఆ క్రమంలో ఆయ స్థానంలో మాజీ మంత్రి చే రికల కమిటీ ఇన్చార్జి ఈటల రాజేందర్‌ను నియమించి, సంజయ్‌ను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది.
అయితే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌జీ.. హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా, బండి సంజయ్ ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళతామని, సీనియర్ల సమావేశంలో స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.
నద్దాను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించినప్పటికీ, వివిధ రాష్ర్టాల అధ్యక్షులందరినీ.. నద్దా మాదిరిగానే కొనసాగించే అవకాశాలు లేనట్లు, పార్టీ వర్గాలు చెబుతున్నాయి.కేవలం పనితీరు ప్రాతిపదికన, రాష్ట్ర అధ్యక్షులను కొనసాగిస్తారని విశ్లేషిస్తున్నారు. సమర్ధత లేని వారిని తొలగిస్తారంటున్నారు.
ఇదిలా ఉండగా.. ఆర్‌ఎస్‌ఎస్ నుంచి బీజేపీకి కీలక బాధ్యతల్లోకి వచ్చేందుకు, పలువురు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంఘ్ నుంచి బీజేకి వెళ్లి, తిరిగి సంఘ్‌కు వెళ్లిన కీలక నేతలకు, తిరిగి బాధ్యతలు అప్పగించే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు పార్టీ నాయకత్వం కొందరి పేర్లు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.