2047 నాటికి ప్రపంచంలోనే భారత్ నెంబర్ 2గా నిలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇది ప్రధాని మోదీతోనే సాధ్యమని.. మరెవరికీ సాధ్యం కాదన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ప్రజలకు దగ్గరైన వ్యక్తి మోదీ అని ప్రశంసించారు. బీజేపీ, టీడీపీ , జనసే కాంబినేషన్ అదిరిపోయిందని.. చరిత్రలో నిలిచిపోయేల 93 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్లతో గెలిపించారని చెప్పారు. ఏపీలో ఈ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుందన్నారు. ప్రధానిగా మోదీ ఉంటారని చెప్పారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏయూ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.
మహారాష్ట్ర, హర్యానాలో ఎన్డీయేను ప్రజలు గెలిపించారు. రాసిపెట్టుకోండి.. రేపు ఢిల్లీలో కూడ బీజేపీ గెలుస్తుంది. ప్రజలంతా మోదీ వెంట ఉన్నారు.. మోదీతోనే ఉంటారు. దేశం కోసం, పేద ప్రజల కోసం మోదీ పనిచేస్తున్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనేదే మోదీ నినాదం.
ఇవాళ ఏపీ చరిత్రలో నిలిచిపోయే రోజు. 7 నెలల్లోనే రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం చుట్టారు. రూ. లక్షా 85వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్.. విశాఖ రైల్వే జోన్‌కు పనులు ప్రారంభమయ్యాయి. 7జాతీయ రహదారులకు ప్రారంభోత్సవాలు జరిగాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి మోదీ. ప్రపంచం మెచ్చే నాయకుడు మోదీ. ఢిల్లీ ఎన్నికల్లోనూ గెలిచేది ఎన్డీయేనే.. అని చంద్రబాబు చెప్పారు.
అంతకు ముందు ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకే వాహనంపై సిరిపురం కూడలి నుంచి బహిరంగ సభా వేదిక అయిన ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వరకు రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో నేతలకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పూలు చల్లుతూ ఆహ్వానించారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యణ్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రధాని మోదీ టూర్ నేపథ్యంలో భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.