సదుద్దేశం.. సదాశయం ఉంటే ఏదైనా సాధ్యమేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రజలందరినీ ఏకతాటిపై నడిపిస్తున్నారని చెప్పారు. భారత్‌ను గొప్ప దేశంగా మార్చేందుకు కృషి చేస్తున్నారుని అన్నారు. ఆత్మనిర్భర్, స్వచ్ఛభారత్, నినాదాలతో ప్రజల మనసు గెలిచారని అన్నారు.
ఐదేళ్ల అరాచక పాలనలో ఏపీ అంధకారంలో కూరుకుపోయిందని పవన్ ఆరోపించారు. అభివృద్ధి అంటే ఆంధ్రా అనేలా కూటమి పనిచేస్తోందని చెప్పారు. మోదీ సర్కార్ నిధులు ఇవ్వడంతోనే.. మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్లు వేయగలుగుతున్నామని చెప్పారు. అభివృద్ధిలో ఏ ప్రాంతం కూడా వెనుకబడకూడదని అన్నారు. రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్టులతో 7 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. ప్రధాని మోదీ సంకల్పానికి , సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్.
అంతకు ముందు ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకే వాహనంపై సిరిపురం కూడలి నుంచి బహిరంగ సభా వేదిక అయిన ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వరకు రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో నేతలకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పూలు చల్లుతూ ఆహ్వానించారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యణ్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం ఏయూ గ్రౌండ్స్ సభా వేదిక నుంచి రూ.2.08 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.