ఏపీ అభివృద్ధి తమ విజన్.. ఏపీ ప్రజల సేవే తమ సంకల్పమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. విశాఖకు వచ్చిన ఆయన రూ.2.08 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు.
ఏయూ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ… సీఎం చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యానికి అండగా ఉంటామని చెప్పారు. ఐటీ, సాంకేతికతకు ఏపీ కేంద్రంగా మారిందన్నారు.
ఇంకా నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యం. ప్రపంచంలో టాప్ నగరాల్లో ఒకటిగా విశాఖ మారబోతుంది. దేశంలోని రెండు గ్రీన్ ఎనర్జీ హబ్‌ల్లో ఒకటి విశాఖలోనే ఉంది. మూడు బల్క్ డ్రగ్ ప్రాజెక్టుల్లో ఒకటి నక్కపల్లిలో ఉంది. నవతరం పట్టణీకరణకు ఏపీ ఒక రోల్ మోడల్ కాబోతుంది. శ్రీసిటీ, క్రిష్‌సిటీ ఏపీని అగ్రగామిగా నిలబెడతాయి. విశాఖ రైల్వే జోన్ దశాబ్దాల కల. ఇప్పుడు సాకారమవుతోంది. ఏపీ సౌలభ్యం కోసం 7 వందే భారత్ రైళ్లు నడిపిస్తున్నాం. అమృత్ భారత్ కింద ఏపీలోని 70కి పైగా రైల్వే స్టేషన్లు ఆధునీకరణ చేపట్టాం. ఏపీ, విశాఖ తీర ప్రాంతం దేశ వాణిజ్యనికి గేట్ వే లాంటివి. ఇవాళ రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించాం… అని మోదీ అన్నారు.
అంతకుముందు నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్‌కు, పూడిమడకలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం, దువ్వాడ- సింహాచలం ట్రాక్ నిర్మాణానికి, విశాఖ- గోపాలపట్నం ట్రాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గంగవరం పోర్ట్- స్టీల్ ప్లాంట్ రైల్వే ట్రాక్‌కు ప్రారంభోత్సవం చేశారు. బౌదార- విజయనగరం రోడ్డు విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేశారు.