రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగింది. వారం రోజుల పర్యటనలో 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు గల అనుకూలతలతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌ను ఆవిష్కరించారు. మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై పలు దిగ్గజ కంపెనీలు సానుకూల సంకేతాలు ఇచ్చాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి అవకాశం అంటూ పారిశ్రామిక వేత్తలకు వివరించారు మంత్రి లోకేశ్. ఏపీలో ఏఏ రంగాలలో పెట్టుబడులకు అవకాశం ఉందో వివరించారు. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ పునరుద్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్ కార్లు, రియల్‌ఎస్టేట్ రంగంలోని ప్రముఖులతో సంప్రదింపులు జరిపారు.
అమరావతి, ఉత్తరాంధ్ర, గోదావరి, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే విధంగా ఆయా రంగాల్లో అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దీంతో ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ కంపెనీలు సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కంపెనీలు వస్తే రాష్ట్రంలో చాలా మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తోంది. లోకేష్ భేటీల నేపథ్యంలో జనవరిలో దావోస్‌లో జరిగే పెట్టుబడుల సదస్సులో పెద్ద ఎత్తున ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. లోకేష్ పర్యటన విజయవంతంపై ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణతో తన పర్యటనను ముగించుకున్న లోకేష్ రేపు హైదరాబాద్ చేరుకుంటారు.