మంకీ పాక్స్‌పై మంత్రి దామోదర రాజనర్సింహ సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందస్తు నివారణ చర్యలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. దేశంలోని ఢిల్లీ 15, కేరళలో 15 కేసులు నమోదు అయ్యాయని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని చెప్పారు. రాష్ట్రంలో వైరస్ నివారణ చర్యల్లో భాగంగా అవసరమైన మెడికల్ కిట్స్, మందులు, ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ మంకీ పాక్స్ నివారణకు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. మంకీ పాక్స్ వల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి వెల్లడించారు. హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రిలలో ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అదే విధంగా అన్ని జిల్లాలలోని ప్రభుత్వ ఆసుపత్రులలో మంకీ పాక్స్ వైరస్‌కు నివారణ మందులు, అవసరమైన కిట్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, కమిషనర్ ఆర్‌వి కర్ణన్, రాష్ట్ర ప్రజా వైద్య ఆరోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్‌లు పాల్గొన్నారు.