అమరావతిని అద్భుతంగా తయారు చేస్తామని అన్నారు సీఎం చంద్రబాబు. తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో 15వందల70 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 15 పరిశ్రమలను ఆయన ప్రారంభించారు. ఆరు పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. 12వందల13 కోట్ల పెట్టుబడులతో ఐదు పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సంక్షేమం సజావుగా సాగాలంటే సంపద సృష్టించాలని.. సంపద సృష్టించడమే తనకున్న బ్రాండ్ ఇమేజ్ అని తెలిపారు. 20 రోజుల్లో కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకురానున్నట్లు చెప్పారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ పై దృష్టి పెట్టామని.. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై దృష్టి సారించామని చంద్రబాబు తెలిపారు
ఇక 2019 నుంచి సీఎంగా ఉన్న జగన్ ఒక్కసారి కూడా శ్రీసిటీని సందర్శించలేదని విమర్శించారు సీఎం చంద్రబాబు. ఆయనకు పెట్టుబడుల విలువ తెలియదని.. చాలా రాష్ట్రాల్లోని సీఎంలు తమ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం పోటీ పడుతుంటారని చంద్రబాబు చెప్పారు. ఏపీలో వెయ్యి కి.మీ.ల తీరం..ఏడు పోర్టులు ఉన్నాయని..కొత్తగా మరో మూడు నిర్మించనున్నామని చెప్పారు. ఏడు విమానాశ్రయాలు ఉండగా.. మరో ఐదు కట్టనున్నామని తెలిపారు. గ్రామాలనుంచి పోర్టులను అనుసంధానించేందుకు వసతులు కల్పిస్తున్నామని చంద్రబాబు అన్నారు.
మరోవైపు నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం వద్ద దెబ్బ తిన్న ఆఫ్రాన్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఆఫ్రాన్ పరిస్థితి, మరమ్మతులు చేయాల్సిన తీరును అధికారులు వివరించారు. సోమశిల నుంచి కండలేరు జలాశయానికి నీరు వెళ్లే కాలువను చంద్రబాబు పరిశీలించారు. రాష్ట్రంలో సోమశిల చాలా కీలకమైనదని.. ఐదేళ్ల నుంచి గత ప్రభుత్వం జలాశయాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి పైన ఉన్న ప్రాజెక్టులు నీటితో నిండాయని.. శ్రీశైలం నుంచి నీటిని తీసుకు వస్తామన్నారు.