మెగా బ్రదర్స్ ఎన్నికల్లోనే గెలవలేరు. ఇక రాజకీయాలేం చేస్తారు?: మంత్రి రోజా
రోజా! నీది నోరా…కుప్పతొట్టా?: మెగా బ్రదర్ నాగబాబు
మీ అందరి కోసం…డైమండ్ రాణీతో కూడా మాటలు పడుతున్నా: పవన్ కల్యాణ్
నేను రాణీనే: కరెక్టే ! ఇంటా, బయటా అన్నింటా రాణినే: రోజా
మంత్రి పదవి రాగానే, రోజా మా ఇంటికి వచ్చింది. కాఫీ తాగింది.
మళ్లీ ఎందుకిలా మాట్లాడుతుందో నాకైతే అర్థం కావడం లేదు: చిరంజీవి
కొందరు మంత్రులకి శాఖల గురించే తెలీదు: వాళ్లు పవన్ కల్యాణ్ ని విమర్శిస్తారు:
మంత్రి రోజాను ఉద్దేశించి హైపర్ ఆదీ
కొందరు పిల్ల బిత్తిరిగాళ్లు ఏదో మాట్లాడితే స్పందించాలా? వాళ్లదంతా మెగా భజన: మంత్రి రోజా
మీ నుంచి ఇన్ని పచ్చి అబద్ధాలా? వెంటనే మీ వ్యాక్యల్ని వెనక్కి తీసుకోండి: రోజాకు వార్నింగ్ ఇచ్చిన గెటప్ శ్రీను
చిన్న నటులే అని అనుకున్నప్పుడు, వారి మాటలకు మీరెందుకు స్పందిస్తున్నారు : సినీ నటుడు బ్రహ్మాజీ


మెగా బ్రదర్స్ అంటే టాలీవుడ్ లోనే కాదు, భారతీయ సినీ పరిశ్రమకు పరిచయం అక్కర్లేని పేరు…అందునా చిరంజీవి అంటే చెప్పనే అక్కర్లేదు. ఇక తమ్ముడు పవన్ కల్యాణ్ అంటే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ పై ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.
ఇక ఇదే టాలీవుడ్ లో ఒక దశలో టాప్ హీరోయిన్ గా రాణించి, అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదిగి, నేడు మంత్రి స్థాయికి చేరుకున్న రోజా…
ఒకే ఒరలో ఇన్ని కత్తులు…దీంతో పొద్దున్న లేస్తే చాలు, వీరి మధ్య ఏదో తగవు…ఒకరిపై ఒకరు కౌంటర్లు, ఎన్ కౌంటర్లు, మధ్యలో హైప్ తీసుకువచ్చే హైపర్ ఆదీలాంటి వారు కొందరు…వార్నింగులు ఇచ్చే నాగబాబు, ఇలా వీరిమధ్య కాలచక్రం గిర్రున తిరిగిపోతోంది. ఎన్నికలు ఇంకా ఏడాది ఉండగానే మాటల యుద్ధాలు ఇంత తీవ్రంగా జరుగుతుంటే, రాబోవు రోజుల్లో రాజకీయం ఇంకా రసవత్తరంగా మారనున్నాయని పలువురు వ్యాక్యానిస్తున్నారు.



పవన్ కల్యాణ్ ప్రసంగాల్లో ఎక్కువ అధికారపక్షాన్ని టార్గెట్ చేస్తుంటారు. అందుకే వారు ఇలా జనసేనానిపై కారాలు మిరియాలు నూరుతుంటారనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఒకటే ఫీల్డు కావడం వల్ల…పవన్ కల్యాణ్ పైకి రోజాని పంపిస్తున్నారనే టాక్ కూడా ఉంది. ఎందుకంటే సినిమావాళ్లు మాట్లాడితే, అవి వెంట వెంటనే వైరల్ అవుతుంటాయి.
ఒకప్పుడు రాజకీయ పార్టీల్లో, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు ఉండేవి. పార్టీలు తీసుకునే విధానాలు, పథకాలు, లోపాలు, ఇలా వ్యవస్థీకృతమైన లోపాల మధ్య దూషణలు, ప్రతిదూషణలు జరిగేవి. వ్యక్తిగత దూషణలకు తావు లేకుండా చూసుకునేవారు. బయట కలిస్తే మళ్లీ ఆప్యాయంగా మాట్లాడుకునే వారు. ఆరోగ్యకరమైన రాజకీయాలు ఉండేవి.
కానీ ఇప్పుడు పర్సనల్ వ్యవహారాలపైకి ఫోకస్ అవుతున్నాయి. ఇంట్లో ఆడవాళ్లని తిట్టుకుంటున్నారు. నిందలు వేస్తున్నారు. రాజకీయ విషయాలను డామినేట్ చేస్తున్నాయి. దాంతో వారి లక్ష్యం మారిపోతోంది. ఏ ఉద్దేశంతో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలకు వచ్చారో, అవి పక్కకి వెళ్లిపోతున్నాయి. చాలా సందర్భాల్లో శృతిమించి రాగానా పడుతున్నాయని నెట్టింట అంతా దుమ్మెత్తిపోస్తున్నారు.