దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని కొనియాడారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఆయన సంతాప తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు. మన్మోహన్ సింగ్ దేశానికి విశిష్ట సేవలు అందించారని రేవంత్ గుర్తుచేశారు. కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్‌గా పని చేశారని చెప్పారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశానికి సేవలందించారని గుర్తు చేశారు.
1991-96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన ఊపిరిలూదారని సీఎం చెప్పారు. సరళీకృత ఆర్థిక విధానాలు తెచ్చి ప్రపంచంతో పోటీపడేలా పునాది వేశారని తెలిపారు. 2013లో భూసేకరణ చట్టం తెచ్చి నిరుపేదలకు న్యాయం జరిగేలా చేశారని సీఎం తెలిపారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని చెప్పారు. మన్మోహన్ సింగ్ తెలంగాణకు ఆత్మబంధువు అని, 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన నాయకుడని కొనియాడారు. తెలంగాణ బిల్లులను 2 సభల్లో పాస్ చేయించిన సారథి అని చెప్పారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.