తనపై ఎటువంటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాలేదని సింగర్ మంగ్లీ చేసిన వ్యాఖ్యలు అసత్యమని అడ్వకేట్ సుబ్బారావు ఆరోపించారు. ఈ అంశంపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. మైక్రో ఫైనాన్స్ కేసులో సింగర్ మంగ్లీతో పాటు ఆమె సోదరుడికి కూడా ప్రత్యక్ష ప్రమేయం ఉందని సుబ్బారావు పేర్కొన్నారు. గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ప్రెస్ మీట్‌లో మంగ్లీ… వీడియోల్లో కనిపిస్తున్న వ్యక్తులు తనకు తెలియదని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే ఆ తరువాత అదే వ్యక్తులతో మంగ్లీ , ఆమె కుటుంబ సభ్యులు కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు బయటకు రావడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.
ఈ పరిణామాలపై మంగ్లీ సమాధానం చెప్పాలని సుబ్బారావు డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ కేసుపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను (C. V. Anand)ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. దీనిపై డీజీపీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy)ని కలిసి ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని కోరనున్నట్లు సుబ్బారావు వెల్లడించారు.


