కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ఇతరులపై కోర్టును ఆశ్రయించిన వ్యక్తి బుధవారం జయశంకర్ భూపాలపల్లి పట్టణంలో హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. కోర్టు విచారణకు ఒక రోజు ముందు ఈ హత్య జరగడం సంచలనం రేపింది.
అయితే, ఈ ఘటనలో రాజకీయ కోణాన్ని తోసిపుచ్చిన పోలీసులు.. 50 ఏళ్ల ఎన్ రాజలింగమూర్తి అనే వ్యక్తిని కొన్ని భూ వివాదాల కారణంగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపారని చెప్పారు.
బుధవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో మోటార్ సైకిల్ పై వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు రాజలింగమూర్తిని అడ్డగించి కత్తితో పొడిచి చంపారని, ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీసు అధికారి తెలిపారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నట్లు చెప్పారు.
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన తర్వాత కేసీఆర్‌తో పాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ రాజలింగమూర్తి 2023 అక్టోబర్‌లో కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు.
తర్వాత కేసీఆర్, ఆయన మేనల్లుడు, మాజీ మంత్రి టి హరీష్ రావుతో కలిసి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది డిసెంబర్‌లో జయశంకర్ భూపాలపల్లిలోని ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి వారిపై పిటిషన్‌ను అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వును హైకోర్టు సస్పెండ్ చేసింది.