పటాన్‌చెరు కాంగ్రెస్ ధర్నాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి క్యాంప్ ఆఫీస్ ముట్టడించేందుకు యత్నించారు. పటాన్‌చెరువు జాతీయ రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్‌లో చేరి బీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలలో మహిపాల్ రెడ్డి తీరు బాగాలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా తన క్యాంప్ ఆఫీసులో ఇంకా కేసీఆర్ ఫోటో ఉండటమే ఇందుకు నిదర్శనమని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం ఇష్టం లేకపోతే .. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో ఉండమని హితువు పలికారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లోకి చొరబడిన కాంగ్రెస్ కార్యకర్తలు.. కేసీఆర్ ఫోటోలు తీసేసి సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టారు.
క్యాంప్ ఆఫీసులో ఉన్న గులాబీ కలర్ కుర్చీలను పగలగొట్టారు.