తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యరు. టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలని మండిపడ్డారు. ఏర్పాట్లు సరిగా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పాట్ల విషయంలో ఎందుకింత వైఫల్యం జరిగిందని నిలదీశారు. బాధ్యత తీసుకున్నవారు సరిగా నెరవేర్చాలి కదా అని మండిపడ్డారు. 2వేల మందే పడతారని అనుకున్నప్పుడు.. 2500 మందిని ఎందుకు లోపలికి పంపించారని ప్రశ్నించారు. ఎక్కువమంది ఉన్నప్పుడు గేటు తీసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా..? అని అన్నారు. పద్ధతి ప్రకారం పనిచేయాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
భక్తులు కూర్చున్నప్పుడు పరిస్థితి బాగానే ఉందని అధికారులు సీఎంకు వివరించారు. బయటకు వదిలినప్పుడు ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పిందని వివరించారు.
అంతకుముందు చంద్రబాబు విజయవాడ నుంచి బయల్దేరి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి తిరుపతి వచ్చారు. నగరంలోని బైరాగిపట్టెడ వద్ద ఘటనాస్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరపున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.