తెలంగాణలో పవర్ గేమ్ మొదలైంది. అధికారం ఎక్కడుంటే అక్కడికి నాయకులు వెళ్లిపోవడం అన్నది ఎప్పటి నుంచో జరుగుతున్నప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల ముందు అది కొంత ఊపందుకుంది. ఇప్పుడు మళ్లీ లోక్ సభ ఎన్నికల ముందు మరింత ఎక్కువైంది. ముఖ్యంగా గతంలో ఓవర్ లోడ్ తో వెళ్లిన కారులో.. ఇప్పుడు ప్యాసింజర్లే లేని పరిస్థితి ఉంది. కారు నుంచి నేతలు అంతా దిగి బీజేపీ వైపు లేదా కాంగ్రెస్ వైపు వెళ్తుండడం ఆ పార్టీని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ మారిన నేతలపై మాజీమంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచు కుపడ్డారు. ఏరు దాటాక తెప్ప తగలేశారన్న చందంగా సరిగ్గా ఎన్నికల ముందు ఇతర పార్టీల్లోకి వెళ్లడంపై కేటీఆర్ తీవ్రంగా స్పందిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డిపై ఘాటైన కామెంట్స్ చేశారు. రంజిత్ రెడ్డి ఎవరో కూడా ఇక్కడి ప్రజలకు తెలియదన్నారు. రంజిత్ రెడ్డికి రాజకీయంగా పార్టీలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామ న్నారు. కేవలం అధికారం, ఆస్తుల కోసమే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు అంటూ కేటీఆర్ విమర్శిం చారు.మరోవైపు ఇటీవల పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు కేటీఆర్. దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడేదాకా వదిలేది లేదన్నారు. స్పీకర్ యాక్షన్ తీసుకోక పోతే.. సుప్రీం కోర్టు దాకా వెళ్తామన్నారు. దానం నాగేందర్ అవకాశవాది అనే విషయం ప్రజలకు అర్థమైం దన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితంతో దానం తన తప్పు తెలుసుకుంటారని అన్నారు.