కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్ ఎపిసోడ్ అంతకంతకు పొలిటికల్ హీట్‌ను పెంచుతోంది. అంతకు మించి అన్నట్టుగా ఇరు పార్టీల మధ్య వార్ ముదురుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి కంటిన్యూ అవుతున్న రాజకీయ రగడ.. పార్లమెంట్ ఎలక్షన్ వేళ మరింత రక్తి కట్టిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య పొలిటికల్ వివాదం రంజుగా సాగుతోంది. ఎవరికెవరూ తగ్గడం లేదు. మొన్నటి వరకూ కాళేశ్వరం, మేడిగడ్డ, అవినీతి, అప్పులు అంటూ ఇరు పార్టీలు డైలాగ్ వార్‌కి దిగితే,.. ఇప్పుడదే రేంజ్‌లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తోంది. అది మాత్రమే కాదు,.. ఆపరేషన్ ఆకర్ష్, గేట్ల రాజకీయం, వాటర్ వార్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఇవే అంశాలతో అటు హస్తం, ఇటు గులాబీ నేతలు మాటల దాడికి దిగుతున్నారు. కౌంటర్ ఎటాక్‌లతో విరుచుకుపడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు. తనకు ఫోన్ ట్యాపింగ్‌తో ఎలాంటి సంబంధం లేదని.. కావాలనే తన క్యారెక్టర్‌ను తప్పుగా చిత్రీకరిం చేందుకు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరినో హీరోయిన్లను బెదిరించాను అనే ఓ మంత్రి మాట్లాడుతున్నారు. ఇలాగే ఆరోపణలు చేస్తే మంత్రి అయినా,.. ముఖ్యమంత్రి అయినా తాట తీస్తామని హెచ్చరించారు. న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. ఇదే కాదు పార్టీ ఫిరాయింపులపై కూడా స్పందించారు కేటీఆర్. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డెడ్‌లైన్ సమయానికి స్పీకర్ స్పందించకపోతే న్యాయస్థానాల్లో పోరాడుతామన్నారు. రైతు ఆత్మహత్యలపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. 218 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనన్న ఆయన.. 25 లక్షల రూపాయలు ఇచ్చి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. 24 గంటలు బెదిరింపులకు పాల్పడి ఢిల్లీకి సూట్ కేసులు పంపే పనిలో పడ్డారని విమర్శించారు కేటీఆర్.
హైదరాబాద్ ప్రజలు ఓటే వేయలేదని పగ తీర్చుకుంటున్నారా అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు కేటీఆర్. నీళ్ల వనరు ఉన్నా నగరవాసులకు నీళ్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ట్యాంకర్లు కొనే దుస్థితి ఎందుకొచ్చిందని నిలదీశారు. పార్టీ గేట్లు ఎత్తడం కాదు.. ప్రజల కోసం ప్రాజెక్టు గేట్లు తెరవాలన్నారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్‌పై కాదు.. ట్యాప్‌లపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్‌ను ఎలా దెబ్బ కొట్టాలనే ఆలోచన తప్పితే.. జనానికి, రైతులకు బాగు చేయాలన్న తపన లేదని విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌ల మధ్య పోటాపోటీ డైలాగ్ వార్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలతో ప్రారంభమైన ఈ పొలిటికల్ యుద్ధం పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయినా సద్దుమణుగుతుందా..? లేదంటే ఫలితాల తర్వాత ఇంకెలా ఉండనుందన్నది ఆసక్తిగా మారింది.