ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. బీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంటే.. మాకేం సంబంధం లేకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని గులాబీ నేతలు మండిపడుతున్నారు. మరోపక్క దోషులను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ సర్కార్‌పై కమలనాథులు సీరియస్ అవుతున్నారు. ఇంతకీ ఎవరి మాటల్లో ఎంత వాస్తవం ఉంది…? ఈ వ్యవహారం వెనుక అసలు సూత్రధారి ఎవరన్నది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
గత కొద్ది రోజులు ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో ఉత్కంఠ రేపుతోంది. బీఆర్‌ఎస్ హయాంలో ప్రతిపక్షాలే టార్గెట్‌గా సీక్రెట్స్‌ను తెలుసుకునేందుకే చేసిన ఆపరేషన్‌లో భాగమేనని రేవంత్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ దిశగానే కీలక విషయాలు కూడా విచారణలో వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం కేటీఆర్ చుట్టూ తిరుగుతోంది. హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ అంశంపై స్పందించిన కేటీఆర్.. కాంగ్రెస్ టార్గెట్‌గా విరుచుకుపడ్డారు. అలాంటి ఇల్లీగల్ పనులు చేయాల్సిన కర్మ తనకు లేదని.. దమ్ముంటే ఆధారాలు బయటకు తీసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన క్యారెక్టర్‌ను దెబ్బతీసేలా మాట్లాడితే మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాటా తీస్తానని.. న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై స్పందించారు బీజీపీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్. అసలు దోషులను తప్పించే ప్రయత్నం చేస్తుందని రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు. దేశ భద్రత, వ్యక్తుల భద్రత స్వేచ్ఛని హరించేలా ట్యాపింగ్ తతంగం నడిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ నేతలకు అస్త్రంగా మారింది. ఎవరికి వారు తీవ్రస్థాయిలో పక్క పార్టీలో విరుచుకుపడుతున్నారు. మరి ట్యాపింగ్ సీక్రెట్ వెనుకు ఉన్న సూత్రధారులు ఎవరు..? కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తున్నట్టు బీఆర్‌ఎస్ కుట్రలేనా…? లేదంటే ఇంకో కోణం ఏమైనా దాగి ఉందా అన్నది తెలియాలంటే పూర్తి విచారణ వరకూ వేచి చూడాల్సిందే.