స్వతంత్ర వెబ్ డెస్క్: డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ కార్డు) పొరపాటున ఇంటి వద్ద మరచిపోయి, సొంత కారు లేదా బైక్‌తో రోడ్డు మీదకు వస్తే.. పోలీసులు, రవాణా అధికారులు ఫైన్ వేయడం.. తరువాత వాటిని చూపిస్తే ఫైన్ మాఫీ చేయడం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అటువంటి కష్టాలకు చెక్ పడింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అన్నింటా డిజిటలైజేషన్ అమలు చేస్తున్న నేపథ్యంలో రవాణా శాఖ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.
డ్రైవింగ్, ఆర్‌సీ కార్డుల స్థానంలో సంబంధిత యాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న పత్రం చూపిస్తే సరిపోతుంది. రవాణా శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వాహన్ పరివార్ సేవలన్నీ ఇప్పటికే ఆన్‌లైన్ అయ్యాయి. లైసెన్స్, ఆర్‌సీ జారీకి కార్డుకు రూ.200, పోస్టల్ చార్జీలుగా రూ.25 తీసుకుని పోస్టల్ ద్వారా నేరుగా ఇంటికే పంపించే వారు. కార్డులు ప్రింట్ కాకపోవడం, పోస్టల్ ఆలస్యం వంటి కారణాలతో రెండు మూడు నెలలైనా కార్డు చేతికి రాని పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా దాదాపు 35 వేల ఆర్‌సీ, డ్రైవింగ్ కార్డులకు ఫీజు వసూలు చేశారు. దీంతో వాటి వరకూ ప్రింట్ చేసి, వాహన చోదకులకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.
రవాణా శాఖ వెబ్‌సైట్ హెచ్‌టీటీపీఎస్//ఏపీఆర్‌టీఏసీ సిటిజన్.ఈప్రగతి.ఓఆర్‌టీ నుంచి ఫారం 6 లేదా 23 డౌన్‌లోడ్ చేసుకుని ధ్రువపత్రం తీసుకోవాలి. లేదా ఏపీఆర్‌టీఏ సిటిజన్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాహనాలు తనిఖీ చేసేటప్పుడు పోలీస్ లేదా రవాణా అధికారులకు డౌన్‌లోడ్ చేసిన పత్రాలు చూపిస్తే సరిపోతుంది. వీటిని అనుమతించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.