విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజ్ ప్రకటిస్తే కొందరు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మండిపడ్డారు. విశాఖ స్టీల్‌కు కేంద్ర ప్రభుత్వం 11 వేల 440 కోట్ల ఆర్ధిక ప్యాకేజ్ ప్రకటించిందని మంత్రి చెప్పారు. ఇది ఏపీ చరిత్రలోనే అతి పెద్ద ప్యాకేజ్ అని అన్నారు. ప్రైవేటీకరణ నుంచి విశాఖను కాపాడుతామని స్పష్టం చేశారు.
స్టీల్ పరిశ్రమను NDA ప్రోత్సహిస్తుందన్న మంత్రి.. కార్మికులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ మంత్రి కూడా స్టీల్ ప్లాంట్‌లో అడుగుపెట్టలేదన్నారు. రాయ్‌బరేలీలో ఏం జరిగిందో ఓ సారి తెలుసుకోవాలని సూచించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు 238 కోట్ల జీతాల బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని… సెయిల్‌లో స్టీల్ ప్లాంట్ విలీనం చేయడం జరగదని… నష్టాల నుంచి బయటకు తీసుకొచ్చాక అప్పగించమని సెయిల్ చెప్పిందన్నారు శ్రీనివాసవర్మ. ఈ నెలాఖరులోగా ముడిసరకు తీసుకొచ్చి, ఉత్పత్తి ప్రారంభిస్తామని.. ఆగస్ట్ నెలాఖరుకి పూర్తి సామర్థ్యం పెంచి స్టీల్ ప్లాంట్‌ను నష్టాల బాటలోంచి లాభాల్లోకి తీసుకొస్తామని తెలియచేశారు. సొంత గనులు లేకపోయినా వైజాగ్ స్టీల్ లాభాల్లో నడిచిన రోజులు ఉన్నాయి. దేశంలోని జిందాల్, జేఎస్‌డబ్ల్యూ వంటి ప్లాంట్‌లకూ సొంత గనులు లేవు.. అయినా లాభాల్లో ఉన్నాయి. సొంత గనులు ఉంటే నష్టాలు రావనేది వాస్తవం కాదన్నారు శ్రీనివాసవర్మ.