దావోస్ వేదికగా జరుగుతోన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో రెండు ప్రముఖ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఉర్సా క్లస్టర్స్, బ్లాక్ స్టోన్ సంస్థలు తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు అంగీకరించాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఇరు కంపెనీల ప్రతినిధులు అవగాహన ఒప్పందం చేసుకున్నారు.
అమెరికాకు చెందిన ఉర్సా క్లస్టర్స్ దాదాపు 5వేల కోట్లతో తెలంగాణలో అత్యాధునిక అర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్‌ను స్థాపించనుంది. దీనికి సంబంధించి దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో ఈ సంస్థ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఉర్సాతో భాగస్వామ్యం పంచుకోవటంతో అత్యాధునిక సాంకేతికత రంగంలో రాష్ట్రం మరో ముందడుగు వేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
పెట్టుబడులు, మౌలిక సదుపాయాలలో ప్రపంచ అగ్రగామి సంస్థ బ్లాక్‌స్టోన్ హైదరాబాద్లో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. 4వేల 500 కోట్లతో రాష్ట్రంలో 150 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.