బీజేపీ చేతిలో ఘోర పరాజయం పాలవ్వడం.. సొంత నియోజకవర్గం న్యూ ఢిల్లీని కోల్పోవడంతో.. ప్రజల తీర్పును గౌరవిస్తానని అన్నారు అరవింద్ కేజ్రీవాల్. అధికారం కోసం తన పార్టీ రాజకీయాల్లో లేదని చెప్పారు. ఇక ముందు ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు సేవ చేస్తుందని వెల్లడించారు మాజీ ముఖ్యమంత్రి.
బీజేపీ కనీసం 45 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఆప్‌కు 20కి పరిమితమవుతుందని ఫలితాల సరళిలో తెలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ” ఇవాళ ఢిల్లీ ప్రజల తీర్పు వెలువడుతుంది.. మేము వాటిని అంగీకరిస్తున్నాం. ప్రజల తీర్పు మాకు శిరోధారం. బీజేపీకి ధన్యవాదాలు. ఇంత మెజర్టీతో బీజేపీకి పట్టం కట్టిన ప్రజల నమ్మకాన్ని, వారి ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నా”… అని అన్నారు కేజ్రీవాల్
గత పదేళ్లలో విద్య, ఆరోగ్యం, నీరు, విద్యుత్ విషయంలో తమ పార్టీ ప్రజల కోసం పనిచేసిందని పునరుద్ఘాటించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. “మేము ఢిల్లీలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కూడా కృషి చేశాం. ఇప్పుడు, మేము నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించడమే కాకుండా సామాజిక రంగంలో కూడా పని చేస్తూనే ఉంటాము. ప్రజలకు సేవ చేస్తాం. మేము రాజకీయాల్లోకి అధికారం కోసం రాలేదు.. ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాము. ఆప్ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు నా ధన్యవాదాలు ” అని చెప్పారు.
మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటమి ఆప్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్టైంది. సాక్షాత్తు పార్టీ అధినేత ఓడిపోవడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. బీజేపీ అభ్యర్థి పర్వేజ్ సాహిబ్ సింగ్ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. వరుసగా రెండు సార్లు ఆప్ అధికార పీఠాన్ని దక్కించుకుందంటే దానికి కారణం కేజ్రీవాలే. ఐఆర్‌ఎస్ అధికారి అయిన కేజ్రీవాల్ అన్నా హజారేతో కలిసి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. అప్పట్లో ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది.
పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఆయన.. బీజేపీ దూకుడును తట్టుకోలేకపోయారు. లిక్కర్ స్కామ్‌లో జైలుకెళ్లినా ప్రజలు సానుభూతి చూపలేదు. ఎన్నికల ప్రచారం కోసం జైలు నుంచి వచ్చి తర్వాత మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. చివరకు ఢిల్లీ ఫలితాల్లో ఎదురుదెబ్బ తప్పలేదు.