ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే.. కేకే సర్వే ఫలితాలు మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఢిల్లీలో ఆప్‌కు 44 సీట్లు, బీజేపీకి 26 సీట్లు కేకే సర్వే కట్టబెట్టింది. అయితే బీజేపీ 46 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఆప్ 24 సీట్లలో ముందంజలో ఉంది. దీంతో కేకే చెప్పిన వాటి కంటే ఆప్‌కు సగానికి పైగా సీట్లు తగ్గినట్టుగా అర్ధమవుతుంది.
ఏపీ ఎన్నికల సమయంలో కేకే పోల్స్ నిజమయ్యాయి. ఇతర ఎగ్జిట్ పోల్స్ అంచనాల కన్నా కేకే సర్వే చాలా దగ్గరగా ఫలితాలను వెల్లడించింది. కూటమికి 160కి పైగా సీట్లు వస్తాయని అంచనా వేయడం.. అది నిజం కావడంతో కేకే సర్వే అప్పట్లో హోరెత్తింది. ఆయన ఇంటర్వ్యూల కోసం ఎగబడ్డారనే చెప్పాలి. కానీ తర్వాత హర్యానా ఫలితాల్లో సర్వే సంస్థ అంచనాలు తప్పాయి. మళ్లీ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల సమయంలో కేకే అంచనాలు నిజమై తిరిగి నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.
అదే విధంగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కూడా కేకే సర్వే చేశారు. ఏఏ నియోజకవర్గంలో ఎవరెవరు గెలుస్తారనే దానిపై కూడ ఆయన జిల్లాల వారీగా అంచనా వేశారు. కానీ ఆయన వేసిన అంచనా తప్పని ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలు రుజువుచేస్తున్నాయి. కనీసం దరిదాపుల్లో కూడా లేకపోవడం, పూర్తి రివర్స్ కావడంతో పెదవి విరిచే పరిస్థితి ఏర్పడింది.
ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీకే పట్టం కట్టాయి. కానీ కేకే సర్వే ఏపీలో, మహారాష్ట్రలో వేసిన అంచనాలు విజయవంతం కావడంతో .. ఢిల్లీ ఫలితాలపై ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఆయన చెప్పిన ఫలితాల్లో పార్టీలు రివర్స్ అయ్యాయి. అంటే బీజేపీకి చెప్పిన స్థానాలు ఆప్‌కి, ఆప్‌కి చెప్పిన స్థానాలు బీజేపీకి వస్తున్నాయి. ఇక కేకే తన సర్వేపై ఇప్పుడేమంటారో చూడాలి..!