దేశరాజధాని ఢిల్లీలో బీజేపీ తన పంతం నెరవేర్చుకుంది. 27 ఏళ్ల తర్వాత హస్తిన పీఠాన్ని అధిరోహిస్తుంది. పదేళ్లపాటు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని చిత్తుగా ఓడించి తన కల నెరవేర్చుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడంతో మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ మళ్లీ అధికార పీఠాన్ని చేజిక్కించుకోగా.. శీష్ మహల్ నుంచి ఆప్ నిష్క్రమిస్తుంది.
ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి?
13 ఎగ్జిట్ పోల్స్‌లో 11.. యాక్సిస్ మై ఇండియా, చణక్య స్ట్రాటజీస్, సిఎన్‌ఎక్స్, డివి రీసెర్చ్, జెవిసి, మ్యాట్రిజ్, పి -మార్క్, పీపుల్స్ ఇన్సైట్, పీపుల్స్ పల్స్, పోల్ డైరీ , టుడేస్ చాణక్య – బిజెపికి స్పష్టమైన మెజారిటీని అంచనా వేశాయి. పోల్ డైరీ (50), పీపుల్స్ పల్స్ (60) మినహా ప్రతి సర్వే కూడా బిజెపికి గరిష్టంగా 40 సీట్లు ఇచ్చాయి.
మ్యాట్రిజ్ కూడా ఆప్ పార్టీకి 32-37 సీట్లను, బిజెపికి 35-40 సీట్లు అంచనా వేసింది. ఇక మైండ్ బ్రింక్ ఆప్‌కి 44-49 సీట్లను అంచనా వేయగా.. వీ ప్రిసైడ్ 46-52 సీట్లతో భారీ మెజారిటీని కట్టబెట్టింది. డీవీ రీసెర్చ్ .. ఆప్ 34 సీట్ల కంటే ఎక్కువ గెలుచుకుంటుందని ఊహించలేదు. పీపుల్స్ పల్స్, సీఎన్‌ఎక్స్ అంచనాల ప్రకారం ఆప్ తక్కువలో తక్కువగా 10 సీట్లు గెలుచుకుంటాయని చెప్పాయి.
2020లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి?
2020 ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. ఢిల్లీలో ఆప్ హ్యాట్రిక్ సాధిస్తుందని అంచనా వేశాయి. 70 అసెంబ్లీ సీట్లలో 56 ఆప్ సొంతం చేసుకుంటుందని చెప్పాయి. ఆ ఏడాది ఎన్నికల ఫలితాల్లో 70 స్థానాలకు 62 స్థానాలను ఆప్ గెలుచుకుని ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేశాయి. ఇక బీజేపీ 8 స్థానాలకే పరిమితమైంది.
2015 లో ఆప్ 67 సీట్లను గెలుచుకుంది. 2013లో తొలి ఎన్నికల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాలకు గాను 28 సీట్లను సాధించుకుంది.
2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
ఒకే విడతలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరిగాయి. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 1998 తర్వాత బీజేపీ అధికారంలోకి రాబోతుంది. మరోవైపు ఆప్ అగ్రనేతలు చిత్తుగా ఓడిపోయారు. అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేంత్ర జైన్.. బీజేపీ అభ్యర్థులపై పరాజయం పాలయ్యారు.