తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు. తొలుత దీనిపై నేడు అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్ పై ప్రత్యేక త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతుందని సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ తెలిపారు. అయితే, ఈ విచారణ.. ట్రయల్ కోర్టులో రిమాండ్ ప్రొసీడింగ్స్‌తో క్లాష్ అవుతుందని సీఎం కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు తెలిపారు. అందువల్ల పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని కోరారు. ట్రయల్ కోర్టు తీర్పునకు అనుగుణంగా మరో పిటిషన్‌తో సుప్రీంను ఆశ్రయించనున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తో ఆప్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఢిల్లీ వ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కేజ్రీవాల్ అరెస్ట్ కు నిరసనగా ఆందోళనకు దిగిన ఢిల్లీ మంత్రులు సౌరబ్ భరద్వాజ్, అతిషిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అతిషి అరెస్ట్ సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రులతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యనేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరో పక్క ఇండియా కూటమి లోని అన్ని పార్టీలు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ ను ఖండించాయి. ఇది ప్రజాస్వామ్య ఖూనియేనన్నారు. ఢిల్లీ సీఎంను నేడు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తున్నారు.