ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఇన్నాళ్లూ పార్టీకి విధేయులుగా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా కారు దిగి వెళ్లిపోతున్నారు. అధికార పార్టీలోకి చేరి పదవులు పొందేందుకు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే సీట్లు ప్రకటించిన అభ్యర్థులు కూడా కాంగ్రెస్ లో చేరిపోవడం పార్టీ పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. కనీసం ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితిలో గులాబీ బాస్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు నేతలు ముందుకు రాకపోవడంతో గులాబీ బాస్ తలపట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు 11 మంది అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. అయితే వారిలో కేవలం ముగ్గురు మాత్రమే ప్రచారంలో పాల్గొంటున్నారు. కరీంనగర్ స్థానంలో బోయినపల్లి వినోద్ కుమార్, మల్కాజిగిరి స్థానంలో రాగిడి లక్ష్మారెడ్డి, పెద్ధపల్లిలో కొప్పుల ఈశ్వర్ ఇప్పటికే ప్రచార బరిలో దిగిపోయారు. అయితే మిగిలిన అభ్యర్థుల్లో నిరాశ, నిస్పృహలే కనిపిస్తున్నాయి.