తెలంగాణలో ఇండియా కూటమి నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ సీపీఐ నేతలకు ఎదురుచూపు తప్పడం లేదు. సింగిల్ సీట్ ప్లీజ్ అంటున్నా.. కాంగ్రెస్ నేతలు మౌన వ్రతం పాటిస్తుండటంతో వారిలో అసంతృప్తి మరింత ఎక్కువ అవుతోంది. సీపీఎం దూకుడుగా వ్యవహరిస్తూ ఒంటరిగా బరిలో దిగుతుంటే.. నిరీక్షణలో ఉన్న సీపీఐ నాయకులు అసెంబ్లీ ఎన్నికల అనుభవం ఎదురుకాకుండా జాగ్రత్తపడాలన్న వ్యూహంలో ఉన్నారు. మరి మిత్రబంధం పాటిస్తున్న కామ్రేడ్లు పొత్తులతో ఎన్నికలకు వెళ్తారా..? లేదంటే ఒంటరిగా బరిలో దిగుతారా..?
పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు మరింత కాకరేపుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు తమ వ్యూహాలకు పదునుపెడుతూ ముందుకు సాగుతున్నారు. తమ రేసు గుర్రాలను ప్రకటిస్తూ ప్రచార హోరుతో దూసుకుపోతున్నారు. అయితే,.. ఇలాంటి పరిణామాల మధ్య మరోసారి కామ్రేడ్లకు ఎదురుచూపు తప్పడం లేదు. అసెంబ్లీ ఎన్నికల మాదిరే అభ్యర్థులను ప్రకటిస్తుంటే.. కామ్రేడ్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కనీసం ఒక్క సీటైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే,.. కాంగ్రెస్‌లో ఆశావహులు అధికంగా ఉండటం… ఇతర పార్టీల నుంచి చేరికలు జోరందుకుని ఫుల్ జోష్‌లో ఉండటంతో హస్తం నేతుల నోటి వెంట పొత్తు మాట రావడం లేదు. కానీ ఇండియా కూటమిలో భాగమైన తమకు పొత్తు ధర్మంగానైనా ఒక్క సీటు ఇవ్వకపోతారా అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు కమ్యూనిస్టులు.
ఇక ఇప్పటికే నాలుగు స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించి… మరో జాబితా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. ఇంత జరుగుతున్నా హస్తం నేతలకు మిత్ర బంధం గుర్తు రావడం లేదు. ఇప్పటి వరకు కామ్రేడ్‌లతో ఒక్కసారి కూడా చర్చలు జరపలేదు. దీంతో ఇటీవల తెలంగాణ సీపీఐ నేతలు AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి పార్లమెంట్ ఎన్నికలల్లో తమకు ఒక స్థానం కేటాయించాలని కోరారు. అయితే,.. రాష్ట్ర నాయకత్వం చర్చలు జరుపుతోందని వారితో చెప్పుకొచ్చారు ఖర్గే.
పార్లమెంట్ ఎన్నికల వేళ సీపీఎం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో బీజేపీని ఎదిరించడంతో పాటు.. పార్టీని బలోపేతం చేయాలంటే పోటీ తప్పనిసరని భావించిన ఆ పార్టీ.. భువనగిరిలో ఒంటరిగా బరిలో దిగనున్నట్టు ప్రకటించింది. అంతేకాదుఅనేక పదవులు నిర్వహించిన మహ్మద్ జహంగీర్‌ను భువనగిరి నుంచి పోటీలో నిలిపి తాము బలంగా ఉన్న స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు ఇస్తోంది. ఇక ఇండియా కూటమిలో భాగం అయినందున సీపీఎంతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలని భావిస్తే.. ఖమ్మం, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నల్గొండ స్థానాలను ఆశిస్తోంది సీపీఎం. అయితే,.. ఇప్పటికే నల్గొండ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డిని మొదటి జాబితాలో కాంగ్రెస్ ప్రకటించింది. మిగిలిన మూడు స్థానాల్లో అయినా ఒక్కటి కేటాయించి.. భువనగిరి నుంచి తప్పుకోండని కోరింతే అందుకు సిద్ధంగా ఉంది సీపీఎం పార్టీ.
అందుకు సిద్ధంగా ఉన్నామని సీపీఎం అంటుంది.
మరోవైపు సీపీఐ పరిస్థితి మాత్రం మింగలేక కక్కలేక అన్నట్టు ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్త కారణంగా తప్పక పోటీ చేస్తామని చెప్పలేక.. హస్తం నేతల తీరుతో పోటీలో ఉండబోమని క్లారిటీ ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అభ్యర్థులను ప్రకటిస్తూ కాంగ్రెస్ ముందుకు వెళ్తోంటే.. ఒక్క సీటైనా కేటాయించకపోతారా అన్న ఆశభావంలో ఊగిసలాడుతున్నారు. ఇలాంటి పరిణామాల నడుమ ఇండియా కూటమిలో ఉన్నందుకే వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నామని.. లేదంటే ఒంటరిగా బరిలో దిగే సత్తా తమకు ఉందని చెబుతున్నారు సీపీఐ నేతలు. ఎన్నికలకు ఇంకా కొంత సమయం ఉన్నందున.. తమకు గట్టి పట్టు ఉన్న పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి తమ బలాన్ని నిరూపించుకుంటారో లేదంటే.. చివరి నిమిషలంలో ఏదైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్‌తో జతకట్టి ముందుకు సాగుతారో వేచి చూడాలి మరి.