స్వతంత్ర, వెబ్ డెస్క్: కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. ముందుగా ఐదు గ్యారంటీల హామీలను అమలు చేసేందుకు మంత్రివర్గం నిర్ణయించిందని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. తనతోపాటు ఉపముఖ్యమంత్రి శివకుమార్ కూడా గ్యారంటీ కార్డులపై సంతకాలు చేశారని చెప్పారు. ఈ హామీలను ప్రజలకు అందేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
** ‘గృహజ్యోతి’ కింద జులై 1 నుంచి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు అందజేస్తామన్నారు. కానీ అంతవరకు పెండింగులో ఉన్న బిల్లులు మాత్రం చెల్లించాలని కోరారు.
** ఆగస్టు 15 నుంచి గృహలక్ష్మి పథకం ప్రారంభిస్తామని.. జూన్ 15 నుంచి జులై 15వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. మహిళలు ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలన్నారు.
** జులై 1 నుంచి ‘అన్నభాగ్య’ పథకం కింద బీపీఎల్ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి పది కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందజేస్తామన్నారు.
** ‘యువనిధి’ పథకం ద్వారా డిగ్రీ అభ్యర్థులకు రూ.3వేలు, డిప్లొమా పూర్తి చేసిన వారికి రూ.1500 ఇస్తామన్నారు. 2022-23లో పాసైన వారికి ప్రతినెల వీటిని అందజేస్తామని.. డిగ్రీ పూర్తయిన ఆరు నెలల తర్వాత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
** జూన్ 11 నుంచి ‘శక్తి’ పథకం కింద మహిళలకు అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సిద్ధూ వెల్లడించారు.