సినీ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇప్పటికే ఉప సంహరించుకున్న వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలని కంగనా చేసిన ప్రకటనపై రాహుల్ స్పందిస్తూ ప్రభుత్వ విధానాన్ని ఎవరు నిర్ణయిస్తారు ? బీజేపీ ఎంపీనా.. లేక ప్రధాని మోదీనా? అంటూ ప్రశ్నించారు. 700 మందికిపైగా రైతులు రైతులు బలిదానం చేసినా బీజేపీ నేతలు పట్టడం లేదని విమర్శించారు. దేశంలో మళ్లీ దుమారం రేపాలనుకుంటున్నారా..? అంటూ నిలదీశారు. కంగనా వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టతనివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
2021లో రద్దు చేసిన సాగు చట్టాలను మళ్లీ సుకురావాలంటూ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కంగనా వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతూ, వాటిని వెనక్కి తీసుకుంటున్నానని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక వీడియో పోస్ట్ చేశారు. సాగు చట్టాలపై తన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవని, పార్టీ వైఖరితో వీటికి ఎలాంటి సంబంధం లేదని కంగన రనౌత్ అన్నారు. సాగుచట్టాలను ప్రతిపాదించినప్పుడు చాలా మంది మద్దతిచ్చారని అన్నారు. కానీ ప్రధానమంత్రి ఎంతో సెన్సిటివిటీ, సానుభూతితో వాటిని ఉపసంహరించారని గుర్తు చేశారు. ప్రధాని నిర్ణయానికి కట్టుబడి ఉండటం ప్రతి బీజేపీ కార్యకర్త బాధ్యత అని చెప్పారు, ఇప్పుడు తాను కేవలం నటిని మాత్రమే కాదని… ఓ రాజకీయ కార్యకర్తను అని గుర్తు చేశారు. వ్యక్తిగతంగా చెప్పినప్పటికీ పార్టీ వైఖరిని ప్రతిబింబిస్తాయనే విషయాన్ని గుర్తించానన్న కంగనా… తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే క్షమాపణ చెబుతున్నానన్నారు.