AP మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై డిక్లరేషన్ దుమారం రేగుతోంది. ఈనెల 28న తిరుమల వస్తానని అంటున్నారు YCP అధినేత జగన్. అయితే జగన్ డిక్లరేషన్ కోసం BJP, TDP, జనసేన పట్టుబడుతున్నాయి. జగన్ అన్యమతస్తులు కావడంతో జీవో నెంబర్ 311 ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని అంటున్నారు. డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలంటున్నారు కూటమి నేతలు. అలిపిరి దగ్గరే జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. డిక్లరేషన్ సమర్పిస్తేనే జగన్‌ను కొండపైకి అనుమతించాలంటున్నారు. జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని కోరుతూ ఇవాళ TTD EO ను కలవబోతున్నారు బీజేపీ నేతలు.
ఈ నెల 28న తిరుమల వస్తానని జగన్ ట్వీట్ చేశారు. అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలని జగన్ పిలుపునిచ్చారు. అయితే, ఇప్పుడు కూటమి నేతల డిమాండ్ కు జగన్ అంగీకరిస్తారా.. ఏం జరుగుతోంది. తిరుమల లడ్డూ వివాదం AP రాజకీయాలను కుదిపేస్తోంది. చంద్రబాబు రాజకీయం కోసం తిరుమల లడ్డూ అంశం పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఈ అంశం కొనసాగుతున్న వేళ జగన్ తిరుమల వెళ్లాలని నిర్ణయించారు. రేపు సాయంత్రం జగన్ తిరుమల చేరుకుంటారు. ఎల్లుండి ఉదయం జగన్ శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే, జగన్ పర్యటన వేళ ప్రస్తుత పరిస్థితుల్లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.
జగన్ తిరుమల పర్యటన వేళ కూటమి నేతలు కొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చారు. జగన్ తిరుమల పర్యటన కు తనకు శ్రీవారి పైన నమ్మకం ఉందనే డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో సహా బీజేపీ నేతలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అదే విధంగా మంత్రి పయ్యావుల కేశవ్ సైతం ఇదే డిమాండ్ చేసారు. జగన్ గతంలో తిరుమల సందర్శన సమయంలో డిక్లరేషన్ ఇవ్వని అంశాన్ని తాజాగా మీడియా సమావేశంలో చంద్రబాబు సైతం ప్రస్తావించారు. TTD అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే జగన్ వెంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వెళ్లాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. జగన్ అన్యమతస్తులు కావడంతో జీవో నెంబర్ 311 ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని పురంధేశ్వరి చెప్పారు.
ఇప్పుడు ఈ డిమాండ్ వేళ జగన్ ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతోంది. జగన్ 2018లో తన పాదయాత్ర ముగిసిన తరువాత కాలి నడకన తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో పలు మార్లు శ్రీవారి దర్శనంతో పాటుగా.. బ్రహ్మోత్సవాల్లోనూ పాల్గొన్నారు. ఇప్పుడు లడ్డూ వివాదం వేళ జగన్ మరోసారి జగన్ డిక్లరేషన్ అంశం తెర మీదకు వచ్చింది. జగన్ అన్యమతస్తుడు కావటంతో డిక్లరేషన్ ఇచ్చి తిరుమల వెళ్లాలని పురందేశ్వరి డిమాండ్ చేసారు. దీంతో.. ఇప్పుడు జగన్ నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.