లడ్డూని అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా హిందూ సంఘాల నేతలు. లడ్డూ వివాదం నేపథ్యంలో అమలాపురంలో భారీ ర్యాలీ నిర్వహించాయి హిందూ ధార్మిక సంస్థలు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని పలు ప్రధాన వీధుల గుండా సాగింది. దీంతో అమలాపురం గోవింద నామ స్మరణతో మారు మోగింది. ర్యాలీకి ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ఏర్పాటు చేసిన నిర్వాహకులు.. లడ్డూ ప్రసాదం కల్తీ చేసిన వారిని శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్ మళ్లించారు.