తమిళనాడులో కల్తీసారా ఘటన అత్యంత విషాదంగా మారింది . మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. మృతుల సంఖ్య 34కి చేరింది. ఆసుపత్రిలో ఇంకా సుమారు 60 మంది చికిత్స పొందు తున్నారు. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ సారా ఘటనపై సీఎం స్టాలిన్ స్పందిస్తూ కల్తీ మద్యం సేవించి పలువురు మరణించిన వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు.నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేశామని స్టాలిన్ తెలిపారు. కల్తీ మద్యాన్ని అడ్డుకోవడంలో విఫలమైన అధికారు లపై కూడా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారి గురించి ప్రజలకు తెలియ జేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు. సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాలను ఉక్కు పాదంతో అణిచివేస్తామని స్టాలిన్ చెప్పారు. కల్లకురిచి జిల్లా కలెక్టరు శ్రవణ్ కుమార్, ఎస్పీ సమయ్ సింగ్ మీనాపై వేటు వేశారు. మరో తొమ్మిది మంది పోలీస్, ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేశారు. కొత్త కలెక్టరు గా ప్రశాంత్, ఎస్పీగా చతుర్వేది నియమితులయ్యారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని స్టాలిన్ చెప్పారు. తమిళనాడు ఎక్సైజ్ శాఖ మంత్రి ముత్తు స్వామి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై డిమాండ్ చేశారు.


