స్వతంత్ర వెబ్ డెస్క్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లాంటి వాళ్లు కూడా తమతో వస్తారని తెలిపారు. పొంగులేటి, తాను మాత్రమే కాదు ఇంకా చాలా మంది నేతలు మాతో కలిసి వస్తారన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడమే అందరి లక్ష్యమని వ్యాఖ్యానించారు. జూన్ మొదటి వారంలో ఈ సస్పెన్స్‌కు తెరపడుతుందన్నారు. దీంతో ఆ నాయకులు ఎవరనేది ఉత్కంఠంగా మారింది. జూపల్లి వ్యాఖ్యలతో ఈటల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
మరోవైపు బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి వంటి నేతలూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ క్యాడర్‌లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. జూన్ 8న పొంగులేటి, జూపల్లితో పాటు మరికొంతమంది నేతలు హస్తం కండువా కప్పుకోనున్నారని సమాచారం. వీరి చేరికతో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి మరింత చేకూరనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.