ఆర్టికల్ 370 పునరుద్ధరణపై జమ్ముకశ్మీర్ అసెంబ్లీ దద్దరిల్లింది. ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం కాస్తా పరస్పర దాడుల వరకు వెళ్లింది. అసలు… కాసేపటి వరకు ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో నెలకొంది. ఈ ఉదయం సభా కార్యక్రమాలు ప్రారంభంకాగానే ఇంజినీర్ రషీద్ సోదరుడు, ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్… ఆర్టికల్ 370 పునరుద్ధరించాలంటూ బ్యానర్‌ను ప్రద్శించారు. ఈ పరిణామంపై ప్రతిపక్ష బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేత సునీల్ శర్మ తీవ్రంగా నిరసన తెలుపగా సభలో గందరగోళం మొదలైంది. ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు.
రంగంలోకి దిగిన అసెంబ్లీ మార్షల్స్ దాడులకు దిగిన ఎమ్మెల్యేలను శాంతింప చేశారు. కొందరు ఎమ్మెల్యేలను బయటకు పంపారు. ఈ సందర్భంగా స్పీకర్.. ఎమ్మెల్యే ఖుర్షీద్ అనుకూల వైఖరి అలంభిస్తున్నారని కమలం పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. సభను కొద్ది సేపు వాయిదా వేశారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2019లో తొలగించిన ఆర్టికల్ 370, 32Aను పునరుద్ధరించాలని కోరుతూ పీడీపీ ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. అంతేకాదు.. ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరింది. బుధవారం సైతం ఇదే అంశంపై శాసనసభ తీర్మానం చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ బీజేపీ సభ్యులు తీర్మానం కాపీలను చించేశారు.