సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని తూర్పుగోదావరి జిల్లా YSRCP అధ్యక్షుడు,మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ విమర్శించారు. కొన్నిచోట్ల దాడులు, మరికొన్ని చోట్ల దౌర్జ్యన్యం, ఇంకొన్నిచోట్ల ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్ల చించివేత వంటి చర్యలకు పాల్పడి అధికార పార్టీ ఏకగ్రీవం చేసుకుందని ఆయన ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. గడిచిన ఆరు మాసాల్లో కూటమి ప్రభుత్వం ఏమి చేయకపోవడం వలన ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని తెలిపారు. అందుకే ఏకగ్రీవం పేరుతొ విపక్ష పార్టీలను నామినేషన్లు వేయకుండా చేసారని ఆయన ఆరోపించారు. సీక్రెట్ పద్దతిలో ఎన్నికలు జరపాలని హైకోర్టు చెప్పినప్పటికీ కూటమి ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు.
ఎన్నికల ముందు ఒకటి ఎన్నికల తర్వాత మరొకటి చెప్పడం చంద్రబాబుకి మొదటినుంచీ అలవాటేనని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. సూపర్ సిక్స్ అని చెప్పి, ఈ ఆరుమాసాల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్పారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొందని ఆయన అన్నారు. రైతులలో తీవ్ర వ్యతిరేకత ఉందని, అందుకే సాగునీటి సంఘాల ఎన్నికలను అరాచక పద్దతిలో నడిపిస్తున్నారని ఆయన విమర్శించారు.
విపక్ష పార్టీలకు చెందిన వారికి నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా చేయడానికి వి ఆర్ ఓ లను ఎమ్మార్వో ఆఫీసుల్లో ఉంచేయడం, కొన్నచోట్ల బంధించడం, వారి దగ్గరకు వెళ్లకుండా పోలీసులను ప్రయోగించి అడ్డగించడం వంటివి చేయడం ద్వారా నామినేషన్లు వేయకుండా చేసారని చెల్లుబోయిన వేణు ఆరోపించారు. జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎలా వ్యవహరించారో ఆయన సోదాహరణంగా వివరిస్తూ, ఇదేనా కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి అని ప్రశ్నించారు.
విజయనగరం జిల్లా ఎస్ కోట లో అయితే బిజెపి కి చెందిన వ్యక్తిని అడ్డంగించి, నామినేషన్ వేయకుండా చేసారని, చివరకు అధికారులు కూడా అధికార పార్టీకే కొమ్ము కాసారని ఆయన పేర్కొంటూ, ఇక వైసిపి పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో వేరే చెప్పనవసరం లేదన్నారు. గతంలో వైసిపి అధికారంలో ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించి, వైసిపి ప్రభుత్వంపై నిందలు మోపారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టిడిపి అరాచకం సృష్టిస్తోందని చెల్లుబోయిన వేణు విమర్శించారు. అధికారం కట్టబెట్టేది ప్రతిపక్ష పార్టీలపై కక్ష, పగ తీర్చుకోడానికా అని ఆయన నిలదీశారు.ఏమాత్రం పారదర్శకత లేకుండా కూటమి ప్రభుత్వం ఏకపక్ష ధోరణిలో వ్యవహారించడం శోచనీయమన్నారు. ప్రజాస్వామ్య వాదులు, ప్రజాస్వామ్య ప్రేమికులు, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం గల వాళ్ళు కూటమి ప్రభుత్వ తీరుపై ఆలోచన చేసి చర్చించాలని ఆయన కోరారు.
వైసిపి ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులున్నా సరే, రైతులకు సకాలంలో 13వేల 500 చొప్పున వాయిదా పద్దతిలో వేశామని, అయితే కూటమి ప్రభుత్వం వస్తే 20వేలు చొప్పున ఇస్తామని చెప్పి, 20పైసలు కూడా వేయలేదని రాజా విమర్శించారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో అరాచకాన్ని అందరూ గమనిస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రద్దతి మార్చుకోకపోతే ప్రజలు తగిన రీతిలో సమయం వచ్చినపుడు బుద్ధిచెబుతారని రాజా అన్నారు.