హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపిన ది కేవ్ పబ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో పట్టుబడ్డ 24 మంది నిందితులకు సీఆర్పీసీ 41కింద నోటీసులు జారీ చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు పంపారు. మరో పక్క పరారీలో ఉన్న నలుగురు పబ్ ఓనర్ల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ది కేవ్ పబ్ వ్యవహారంతో నగరంలోని పబ్బులపై ఫోకస్ పెట్టింది నార్కోటిక్ బ్యూరో. ప్రతి రోజు ఆకస్మిక తనిఖీలు జరుపుతామని.. దొరికిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
హైదరాబాద్ ఖాజాగూడలోని ది కేవ్ పబ్‌లో దాడులు నిర్వహించిన పోలీసులు..సైకిడెలిక్ పేరుతో ప్రత్యేకంగా పార్టీ నిర్వహించడంతో పోలీసులే షాక్ అయ్యారు. టీజీన్యాబ్, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పబ్‌లో సోదాలు చేసి 55 మందిని అదుపులోకి తీసుకొని పరీక్షలు నిర్వహించగా 24 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో ఐటీ, వ్యాపార రంగాలకి చెందిన వారున్నారు. పార్టీ నిర్వహణకు ప్రధాన సూత్రదారులైన పబ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.