రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు రేషన్ బియ్యం కోసం తెల్లవారుజాము నుండి చౌకధరల డిపోల వద్ద అగచాట్లు పడుతున్నారు. రోజుకు 150 కార్డులకు రేషన్ ఇవ్వాలని CSDT చెప్పారని రేషన్ డీలర్ చెప్పడంతో ముందు వచ్చిన వారికి ముందొచ్చిన రీతిలో డీలర్ రేషన్ ఇస్తున్నారు. దీంతో పేదలు తెల్లవారు జాము నుంచే రేషన్ షాపుల వద్ద క్యూ కడుతున్నారు. అనంతపురం జిల్లా సోమందేపల్లిలో ఈ పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వం ఇచ్చే చౌకధరల రేషన్ బియ్యం కోసం పేదల ఎదురుచూపులు ఎక్కువయ్యాయి. తెల్లవారు జాము నుండి తమ రేషన్ బియ్యం కోసం చౌకధరల డిపోల వద్ద అష్టకష్టాలు పడుతున్నారు. ఆలస్యమైతే తమకు రేషన్ బియ్యం రావేమో అనే భయంతో వారు ఆందోళన చెందుతున్నారు.
అనంతపురం జిల్లా సోమందేపల్లిలో ఎనిమిది చౌకధరల డిపోలు ఉన్నాయి, సుమారు 5 వేలకు మందికి పైగా రేషన్ కార్డులున్న లబ్ధిదారులు ఉన్నారు. గ్రామంలో రోజుకి 150 కార్డులకు మాత్రమే రేషన్ బియ్యాన్ని ఒకేచోట ఇస్తూ ఉండడంతో ప్రజలు తమకు ఆతృత చెందుతున్నారు. క్యూలో ఉంటున్నారు. ఉదయం నుండి ఇలా రేషన్ బియ్యం కోసం రావడంతో తమ రోజువారి పనులకు ఆటంకం కలిగి, ఆదాయం కోల్పోతున్నామని వారు వాపోయారు. ప్రభుత్వ అధికారులు స్పందించి, తమకు రేషన్ బియ్యం సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు.
రోజుకు కేవలం 150 కార్డులకు మాత్రమే బియ్యం సరఫరా చేయాలని CSDT ఆదేశించారని రేషన్ డీలర్ వెల్లడించారు. అంతకు మించి బియ్యం సరఫరా చేసిన ఓ రేషన్ దుకాణంపై చర్యలు తీసుకొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు, గత వైసీపీ ప్రభుత్వంలో ఏర్పరిచిన MDU ఆపరేటర్లు నిర్లక్ష్యంగా వచ్చి వేలిముద్ర వేస్తూ ఉండడంతో ఆలస్యం అవుతోందని చెప్పారు.