స్వతంత్ర వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడతూ.. జగన్ పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పడకేశాయన్నారు. ఏపీలోని 69 నదులను అనుసంధానం చేయడం ముఖ్యమన్నారు. ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తైతే.. నీటి సమస్యే ఉండదని తెలిపారు. ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి ప్రధాన నదులు.. వీటి కింద అనేక నదులు ఉన్నాయన్నారు. ఉత్తరాంధ్రలో నదులను అనుసంధానం చేసేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు.
వంశధార – గోదావరి నదులను అనుసంధానం చేయొచ్చు.. కానీ జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. తాను ప్రెస్ మీట్ పెడుతున్నానని.. ప్రాజెక్టులపై సీఎస్ హడావుడి సమీక్ష పెట్టారని తెలిపారు. సీఎం జగన్, మంత్రి లేకుండానే ప్రాజెక్టులపై సమీక్షించారన్నారు. ‘‘ఇరిగేషన్ మంత్రి ఉన్నారు కానీ.. అంబోతులా అరుస్తాడు తప్ప ఏం చేయడు..?. కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చొపెట్టినట్టే ఉంది. ఈ ఏడాది చివర్లో ఏదో ఐదు ప్రాజెక్టులు ప్రారంభిస్తారట. ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా నిర్మాణం ఎలా పూర్తి చేస్తారు..?’’ అంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.