ములుగు జిల్లాలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ పరిధిలోని ఉప ఆలయమైన గొల్లాల గుడి గుప్తనిధుల కోసం గుర్తు తెలియని దుండగుల చేతిలో ధ్వంసమైంది. రామప్పలో ఆలయ పరిసరాలల్లో గుప్తనిధుల కలకలం రేపింది. గొల్లాలగుడి ఆలయ పై కప్పు పగలగొట్టి లోపలికి చొరబడిన గుర్తు తెలియని దుండగులు… శివలింగంను పెకిలించారు.
పురావస్తు శాఖ సిబ్బంది గొల్లాల గుడి ఆలయాన్ని శుభ్రం చేయడానికి వెళ్ళగా పైకప్పు తీసి కింద పడేసి నిచ్చెన ద్వారా దుండగులు లోపలికి దూరినట్లు గుర్తించారు. ఆలయం లోపల శివలింగంతో పాటు శిల్పాలను దుండగులు పడగొట్టారు. గుర్తు ఆలయం లోపల పువ్వు ఆకారంలో ఉన్న శిల్పాన్ని పగులగొట్టి పక్కకు పడేశారు. దాని కింద గుప్తనిధులు ఉన్నాయని అనుమానంతో పగులగొట్టినట్లు తెలుస్తోంది.
కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న గొల్లాల గుడి శిథిలావస్థలో ఉండగా కేంద్ర ప్రభుత్వ నిధులతో రెండేళ్ల క్రితం ఆయంలోని శిల్పాలతో పాటు శివలింగాన్ని పునరుద్ధరించారు. దేవాలయం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి గేటుకు తాళం వేసి ఉంచుతున్నారు. ఆలయంలో ధూప దీప నైవేద్యాలు లేనప్పటికీ ఆలయం చుట్టూ పిచ్చిమొక్కలు తొలగించి వచ్చే భక్తులు దర్శించుకునేలా ఏర్పాటు చేశారు. గుప్తనిధుల తవ్వకంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసి దుండగులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.