అనారోగ్యం దౌర్భాగ్యం, ఆరోగ్యం మహాభాగ్యం. ఇది నిజమే. అయితే, ఆ మహాభాగ్య ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషించే శరీర అంతర్గత అవయవం ఏమిటి..? ఇంకేమిటి నిస్సందేహంగా హృదయమే. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచేంద్రియాలు..వేటి డ్యూటీ అవి చేస్తున్నా..సెకను సైతం రెస్ట్ తీసుకోవడానికి వీలులేని అవయవం మాత్రం గుండే. రెస్టు బెస్టని గుండె అరక్షణం భావించినా…ఆ జీవికి అవే ఆఖరి ఘడియలు అవుతాయి. అందుకే హృదయాన్ని..చంటిపాపాయిలా, కంటికి రెప్పలా చూసుకోవాలి. హార్ట్ ను జాగ్రత్తగా చూసుకోవడం ఓ ఫైన్ ఆర్ట్. హర్ట్ అయ్యే పరిస్థితులు హార్ట్ కు కల్పిస్తే..ఇక ఆ ప్రాణికి మరో ఉదయం ఉండదు.
గుండె..గుండె, నీవు పదిలంగా ఉండమ్మా..! నిండు నూరేళ్ళ జీవితం ఇవ్వమ్మా..! అని జీవులు హృదయ ప్రార్థన చేస్తే, శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి.. అనే దీవెనలు అందించడానికి తనకేం అభ్యంతరం లేదని, నిండు నూరేళ్లు కాదు ఇంకో పదేళ్లయినా ప్రాణులు నిక్షేపంలా ఉండడానికి తాను సాయం చేస్తానని గుండె చెబుతుంది. అయితే, కండిషన్ ఏమిటంటే దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలని, మితి మీరి మద్యపానం చేయరాదని, పెట్టెల పెట్టెల సిగరేట్లు ఊదిపారేయరాదని మందుబాబులు, ధూమపాన ప్రియులకు హెచ్చరికలు చేస్తోంది. ఖర్మకాలి రోగం వచ్చినప్పుడు.. తాను కొన్ని హింట్ లు ఇచ్చినా పట్టించుకోని చైన్ స్మోకర్లు, ఓవర్ డ్రింకర్లు, ఓవర్ థింకర్లకు స్టెంట్ లు వేయించుకునే స్థితి మాత్రం వచ్చేస్తుందని తెలియజేస్తోంది.
అనుకోని అవాంతర పరిస్థితులు, టెన్షన్ లు, వంశపారంపర్యంగా గుండె జబ్బులు ఎదుర్కొనేవారిని…ముందు జాగ్రత్తలు తీసుకోండి, మంచి వైద్యం చేయించుకోండి, తనను డ్యూటీ చేయలేని స్థితికి తీసుకురావద్దని కోరుతుంది. హార్ట్ ఎటాక్ సింటమ్స్ తెలియజేస్తుంది. అప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే గుండె సాఫీగా తన పని చేసుకుంటుంది. అన్ని సవ్యంగా ఉన్నా కొందరిలో సడన్ గా హార్ట్ ఎటాక్ లు ఎందుకు వచ్చేస్తాయి అంటే.. ఆ విషయం తనకు తెలియదని.. ఎక్కడో ఏదో లోపం వల్లో, కర్మ వల్లో తన డ్యూటీకి విఘాతం కల్గవచ్చని గుండె అంటోంది. అయితే, సమతుల్య పోషకాహారం తీసుకుంటూ, ఆరోగ్యకర అలవాట్లతో, సమయానికి తిండి, నిద్ర ఉండేలా చూసుకుంటూ, వ్యాయామం చేసేవాళ్లు, పూర్ణ ఆరోగ్యంతో ఉన్నవాళ్లు, సంపూర్ణ ఆయుర్దాయం కల్గివుంటారని..వీళ్ల విషయంలో తన డ్యూటీ చాలా పెర్ ఫెక్ట్ గా ఉంటుందని అంటోంది. రెస్ట్ లెస్ గా పని చేసే గుండెకు కాస్త రెస్ట్ ఉండాలని పీకల్దాకే తాగే మందుబాబులో, చైన్ స్మోకర్లో అనుకుని, గుండె మీద జాలిపడిపోయి ఆ ఆ రూట్ లో వెళితే గుండెకు కోపం రావడం ఖాయం. రెస్ట్ అంటే వరస్ట్ అని భావించే తనను రెస్ట్ తీసుకోమంటరా..అని గాయపడిన హృదయం..వాళ్ల పని పట్టేసి హార్ట్ ఎటాక్ తెప్పించేస్తుంది.
హృదయం లేని ప్రియురాలా రాయివి, కసాయివి, హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమా.. ప్రేమా.. గుండె నిండా నీ ప్రేమే, నా హృదయపు కోవెలలో, హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవత అంటూ పాటలు పాడేసుకున్నా, గుండెల్లో గాయం, లేదాయే వైద్యం, బ్రతుకంతా శూన్యం, కన్నీరే ఆహారం, నా హృదయంలో నిదురించే చెలి అంటూ సినీ గేయాల కూనిరాగాలు తీసేసినా, గుండెలు తీసిన మొనగాడు, గుండెకు గాయం, గుండె దడ దడ అని మాటల రూపంలో తల్చుకున్నా… గుండె తన విధి నిర్వహణలో ఏకాగ్రత కొల్పోదు. పొగడ్తలు, తెగడ్తలు, ప్రశంసలు, అభిశంసలు..అన్నింటినీ సమంగానే తీసుకుంటుంది.
తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనే పద్యాలు ఎవళ్లకు ఎలా అప్లై అయినా, తనకు కోపం, కక్షలు ఏర్పడి శిక్షలు వేయడానికి దిగితే…టోటల్ స్మాష్ అయిపోతుందని గుండెకు బాగా తెలుసు. హృదయానికి కోపం వచ్చి ఒక్క క్షణం హర్తాళ్ కో, హంగర్ స్ట్రైయిక్ కో దిగిదంటే హృదయ విదారక పరిస్థితులు వచ్చేస్తాయి. హార్ట్ ఆగిందంటే, ఆ వ్యక్తి పని మఠాష్. ఆ కాయం భౌతికకాయం, మరుభూమి, చితి మంటలు, ఖననాలు.. ఈ తంతులన్నీ జరిగిపోతాయి. ఇన్ని విషయాలు గ్రహించిన గుండె.. ప్రాణులు తమ ఆరోగ్య విషయంలో చిన్న చిన్న తప్పులు చేస్తుంటే.. కొన్ని హింట్ లు ఇచ్చి వైద్యం చేయించుకోమని బోధిస్తుంది. శరీర ఘర్ లోకి సుగర్ ప్రవేశిస్తే..ఇంక దాన్ని బయటకు పంపించడం ఎవరి తరం కాదు. అందుకే చక్కెర వ్యాధి గ్రస్తులు, అధిక బరువు ఒబెసిటీతో బాధపడే వారు, వృత్తిపరమైన, వ్యక్తిగత ఒత్తిడితో సతమతం అయ్యేవారు, కొవ్వు పదార్థాల ఆహారాలు అధికంగా తీసుకునేవారు, ధూమపాన, మద్యపాన ప్రియులు…తన విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని గుండె హెచ్చరికలు చేస్తోంది.
అసలు గుండెనొప్పి ఎక్కడ వస్తుంది, హార్ట్ ఎటాక్ కు ముందస్తు హెచ్చరికలు ఏమిటని ప్రశ్నించుకుంటే.. సాధారణంగా ఛాతి మధ్యలో నుంచి భుజాలు, చేతులు, ప్రధానం ఎడమ చేయి లోపలి భాగం నుంచి ఈ నొప్పి తలెత్తి మెడ, దవడలు, దంతాల వరకు వ్యాపిస్తుంది. సాధారణ విశ్రాంతి ద్వారా కొంత ఉపశమనం కలుగుతుంది. అయితే, ప్రిలిమనరీ నొప్పి తలెత్తినప్పుడే వైద్యసాయం పొందడం మంచిది. భావోద్వేగాలు, అధిక ఒత్తిడి, విపరీతమైన శారీరక, మానసిక శ్రమ, మితిమీరిన ఆహారం తీసుకోవడం వల్ల గుండె నొప్పిని మరింత తీవ్రతరం చేయవచ్చు. ఛాతి నొప్పి బిగుతుగా, పిండేసినట్టు అనిపించి, శ్వాస ఆడని పరిస్థితి, ఒళ్లంతా చెమటలు పట్టి, ఆకస్మిక మైకం, గుండెలో మంట, ఇన్ డైజేషన్, వికారం, అలసట తదితర ఎన్నో లక్షణాలు గుండె నొప్పికి కారణం కావచ్చు.
అందరికి గుండెనొప్పి ఒకే విధంగా ఉండకపోవచ్చు. బహుళ లక్షణాలు వివిధ స్థాయిల్లో ఎదుర్కోవచ్చు. గుండెపోటుతో సంబంధం లేని లక్షణాలతో, తేలికపాటి లక్షణాలతో సైతం సైలెంట్ హార్ట్ ఎటాక్ రావచ్చు. గుండెకు తగినంత రక్తప్రసరణ, ఆక్సిజన్ అందని పరిస్థితుల్లో ఇది తలెత్తవచ్చు. హృదయ రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, అడ్డుపడ్డప్పుడు గుండె కండరాలు నిర్జీవంగా మారుతాయి. దీన్ని వైద్యపరిభాషలో మయోకార్డియల్ ఇన్ఫార్క్‌షన్ గా పిలుస్తారు.
రక్తనాళాల లోపల చక్కటి పొర దెబ్బతినడం ప్రారంభించినప్పుడు రక్తనాళాల ఫలకాలు అభివృద్ది చెందుతాయి. కొవ్వు, కాల్షియం, పీచుకణజాలం తదితరాల కలయిక వల్ల ఏర్పడిన ఈ ఫలకాలు ధమనుల్లో అడ్డంకికి దారితీస్తాయి. సజావుగా సాగే రక్త ప్రవాహాన్ని ఇవి నిరోధిస్తాయి. కరోనరీ ఆర్టరీ డిసీజ్ గా దీన్ని పిలుస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి తీవ్ర ఛాతి నొప్పికి, శ్వాస ఆడకపోవడానికి దారితీస్తుంది. ఇది మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ కు దారితీస్తుంది. గుండెలోని కొంత భాగానికి రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోయినప్పుడు అక్కడి గుండె కండరాలు నిర్జీవంగా మారడంతో.. హార్ట్ ఎటాక్ వస్తుంది. వ్యక్తికి కరోనరీ ఆర్టరీ వ్యాధి ఉన్నట్టు గమనిస్తే ఆ అడ్డంకి తొలగించడానికి, రక్తప్రవాహాన్ని పునరుద్దరించడానికి, ఆ వ్యక్తి జీవితాన్ని రక్షించడానికి యాంజియోప్లాస్టీ స్టంట్ ఉపయోగించాల్సి ఉంటుంది. గుండె కండరాలకు ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తాన్ని ఇది సరఫరా చేస్తుంది. హార్ట్ పేషెంట్ ప్రాణాలు నిలబెడుతున్న వైద్యపరికరం స్టెంట్ కు ఇప్పుడు విపరీతమైన డిమాండ్ వచ్చింది. శాశ్వత స్వభావం గల మెజార్టీ స్టెంట్ లు లోహంతో తయారవుతాయి. ప్రత్యేక క్యాటగిరి స్టెంట్‌లు సైతం ఇప్పుడు వస్తున్నాయి. అధునిక స్టెంట్ లు ఔషధ పూతను కలిగి ఉంటున్నాయి. ఏదైనా అవరోధం కన్పిస్తే సంబంధిత సమస్యను ఇవి నివారిస్తున్నాయి.
లోహ నిర్మాణ స్టెంట్ ల వల్ల శరీరంలో ఇవి శాశ్వతంగా ఉంటాయని వైద్యప్రముఖులు చెబుతున్నారు. కొన్ని అరుదైన సందర్భాల్లో స్టెంట్ ల్లో స్టెనోసిస్ అభివృద్ది చెందవచ్చు. అప్పుడు రోగికి మరొక యాంజియోప్లాస్టీ లేదా బైపాస్ సర్జరీ అవసరం అవుతుందని తెలియజేస్తున్నారు. బాగా గమనించాల్సి విషయం, స్టెంట్ గుండె జబ్బులను నివారించదు. హార్ట్ ఎటాక్ లు నయం చేసే శక్తి దీనికి ఉండదు. ఇది కేవలం రక్తప్రవాహాన్ని పునరుద్ధరిస్తుంది. క్లిష్టమైన సమయంలో రక్షించే శక్తి స్టంట్ కు ఉన్నా, భవిష్యత్ లో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంటే ఇది నిరోధించలేదు. అప్పుడు వేరే స్టంట్ లు అవసరం పడవచ్చు. రక్తం గడ్డకట్టే అవకాశాలు తగ్గించడానికి కొన్ని మందులు సైతం వాడాల్సి ఉంటుంది. వైద్యుల పర్యవేక్షణలో ఈ మందులు వాడాలి.
హెల్త్ రికవరీ సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఖచ్చితంగా డాక్టర్ల సలహాలు, సూచనలతోనే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. వాకింగ్, డ్రైవింగ్, స్విమ్మింగ్, స్టెయిర్ కేస్ స్టెప్పింగ్, వెయిట్ లిఫ్టింగ్, ఎక్సర్ సైజ్..ఇలా అన్ని విషయాల్లో, మందుల వాడకంలో, ఆహారపు అలవాట్లలో వైద్యుల సలహాలు అత్యావశ్యకం. హార్ట్ పేషెంట్లు.. తృణధాన్యాలు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే మంచిది. తాజా పండ్లు, కూరగాయల వంటకాలు తినాలని, ఉప్పు, చక్కెర వాడకం తగ్గించాలని వైద్యులు చెబుతున్నారు. కొవ్వుపదార్థాల వినియోగాన్ని తగ్గించాలంటున్నారు. మాంసాహారం తీసుకునే వ్యక్తులు చేపలు, లీన్ మీట్ తీసుకోవాలని రెడ్ మీట్ చెక్ పెట్టాలని అంటున్నారు. ఒత్తిడి తగ్గించుకుని ప్రశాంత జీవనానికి ప్రయత్నించాలని తెలియజేస్తున్నారు.
గ్యాస్ట్రిక్ నొప్పికి గుండె నొప్పికి మధ్య వ్యత్యాసం ఉంటుందని, గుండెపోటు కారణంగా వచ్చే నొప్పి అసిడిటీని పోలి ఉంటుందని వైద్యులు అంటున్నారు. తీవ్రత, నొప్పి వచ్చే ప్రదేశంలో తేడా ఉంటుందని చెబుతున్నారు. ఎసిడిటీ వల్ల నొప్పి వస్తే రొమ్ము ఎముక వెనుక మంటగా ఉంటుందని, ఇది గొంతు వరకు సాగవచ్చని తెలిపారు. గుండె నొప్పి అయితే ఉదరభాగం వైపు మధ్యలో లేదా ఛాతిలో ఎడమ వైపు రావచ్చని అన్నారు. అనారోగ్య సమస్యలు అధికంగా ఉన్నవారికి గుండెపోటు రిస్క్ ఎక్కువని అంటున్నారు. ఈ వ్యక్తులు మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.