గవర్నర్ తమిళిసై తీరుపై మంత్రి హారీష్ రావు తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని మండిపడ్డారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ రాజకీయ కక్ష సాధింపుకి పాల్పడుతున్నారని విమర్శించారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సభలో పాల్గొన్న ఆయన గవర్నర్ తీరును ఎండగట్టారు.
గజ్వేల్ లో ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని తీర్మానం చేస్తే ఆ బిల్లును ఆమోదించకుండా అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమకారుడిగా గవర్నర్ తీరును ప్రశ్నించే హక్కు తనకుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పోకడల వల్ల దేశంలో ఉన్న పౌరులు బయట దేశాలకు వెళ్లిపోతున్నారని విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా గవర్నర్ రాజకీయాలు వదిలేసి తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని హరీష్ రావు కోరారు.