విధుల్లో ఉన్న పోలీసులపై దాడి కేసులో అరెస్టై చంచల్ గూడ జైలులో ఉన్న వైసీటీపీ అధ్యక్షురాలు షర్మిల బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె సీఎం కేసీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఏనాడైనా సచివాలయం వెళ్లారా? బంగారు తెలంగాణ తెస్తానన్న కేసీఆర్ మాటలు ఏం అయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇంతవరకు అమలు చేయలేదని మండిపడ్డారు.
కొడుకు కేటీఆర్ రియల్ ఎస్టేట్ దందాలు, కూతురు కవిత లిక్కర్ దందాలు చేస్తూ వేలకోట్ల రూపాయాలు దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలన తాలిబన్లను తలపించేలా ఉందని, గొంతు విప్పితే ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిట్ ఆఫీసుకు వెళ్తుంటే అడ్డుకుంటారా? మహిళా అని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తిస్తారా? అని పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు దాడులు చేస్తుంటే పక్కకు తోసేశానని తెలిపారు. తన శరీరాన్ని తాకే వీడియోలు బయటపెట్టలేదని.. ఎడిటింగ్ వీడియోలు మాత్రమే రిలీజ్ చేశారన్నారు. మాజీ సీఎం సతీమణి అనే కనీస గౌరవం కూడా లేకుండా విజయమ్మతో అలా ప్రవర్తిస్తారా? అని షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు.