తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివోహం నామస్మరణం
మహదేవుడి మహా శివరాత్రి వేడుక అంటే భక్తులకు మహదానందం. పచ్చితోలు కట్టుకుని, పామును మెడలో వేసుకుని, రుద్రభూమిలో వసించే శంకరుడు ఢాంబిక, ఢంబాలకు వ్యతిరేకుడు. పైకి భక్తి, లోన కుయుక్తి ప్రదర్శించే కపట భక్తులపాలిట ఆదిదేవుడు ప్రళయ భయంకరుడు. గరళాన్ని కంఠంలో దాచుకున్న శివుడు నిజమైన భక్తుల పాలిట సరళ హృదయుడు. ఆ భోళా శంకరుడు, భక్త జన వరదుడు పరమేశ్వరుడి మహా శివరాత్రి వేడుకలు వాడ వాడల్లోని గుడుల్లో కన్నుల పండువగా, అత్యంత భక్తి ప్రదంగా సాగుతున్నాయి.
అనంత కోటి నామాలతో ఆరాధింపబడుతున్న మహదేవుడి మహా శివరాత్రి ఉత్సవాలు విశ్వవ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాల్లో అత్యంత భక్తిప్రదంగా కొనసాగుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు, త్రిలింగ క్షేత్రాలు, అష్టాదశపీఠాలతో పాటు పల్లె పల్లెల్లోని శివాలయాలన్ని శివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు మహాశివరాత్రి అంటే ఠక్కున గుర్తుకువచ్చే కొండ కోటప్ప కొండ. కోటప్ప కొండ పై వెలసిన త్రి కోటేశ్వర స్వామి దర్శనం కోసం లక్షలాది భక్తులు తరలివచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే స్వామి గా త్రికోటేశ్వరస్వామిని భక్తులు ఆరాధిస్తారు. ఎన్నో విశిష్టతల నిలయంగా ఉన్న కోటప్ప కొండ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో కాకి అనే మాటే వినిపించదు. ఒక్కటంటే ఒక్క వాయసం సైతం కనిపించదు. శివుడు బ్రహ్మచారి గా వెలసిన క్షేత్రం కోటప్ప కొండ. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కలయిక క్షేత్రంగా కోటప్పకొండకు పేరుంది. ఎక్కడా లేని విధంగా తళుక్కున మెరిసే ప్రభలు శివరాత్రి వేడుకలో ఇక్కడ దర్శనమిస్తాయి. మహా భక్తురాలు గొల్ల భామ ఆలయం కోటప్ప కొండ కింద దర్శనమిస్తుంది.
పల్నాడు జిల్లా నరసారావుపేట సమీపంలో ఉన్న కోటప్ప కొండకు ఎంతో పురాణ చరిత్ర ఉంది. ఎన్నో కథనాలు ఉన్నాయి. త్రిమూర్తులు కలిసి వెలసిన గిరి కావడంతో దీనికి త్రికోటేశ్వరస్వామి కోటప్ప కొండగా పేరు సంతరించుకుందని ఆలయ ప్రధాన అర్చకులు అయ్యప్ప గురుకుల్ తెలిపారు. మహిమాన్విత కోటప్ప కొండ విశిష్టతను అయ్యప్ప గురుకుల్, పలువురు భక్తులు వివరించారు.
మహా శివరాత్రి సందర్భంగా మహిమాన్విత, మహోన్నత, మహత్తర మహా పుణ్యక్షేత్రం కోటప్ప కొండకు అసంఖ్యాక భక్తులు తరలివచ్చారు. ఎంతో ప్రాధాన్యం ఉన్న కోటప్ప కొండను ఆధ్యాత్మిక క్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం మరింత అభివృద్ది చేయాలని భక్తులు కోరుతున్నారు. కోటప్ప కొండ కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తే స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా పేరొందిన ఏపీ పేరు ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడుతుందని పర్యాటక ప్రేమికులు, భక్తజనులు తెలియజేస్తున్నారు.
జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి శ్రీశైలం, దక్షిణ కాశీగా పేరు పొందినది కాళేశ్వరం, పంచారామ క్షేత్రం దాక్షారామ. ఈ మూడు శైవ క్షేత్రాలు త్రిలింగ క్షేత్రాలు. ఈ త్రిలింగ దేశ, త్రిలింగ దేవాలయాలతో పాటు ఎన్నో ప్రముఖ దేవాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో మహత్తర పుణ్యక్షేత్రంగా శ్రీ కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి క్షేత్రం విరాజిల్లుతోంది. శ్రీ కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి క్షేత్రంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.
మృత్యుంజయుడైన శివుని పూజిస్తే మృత్యువు దరిచేరదని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు మహాశివరాత్రిని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. శ్రీ కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి క్షేత్రంలో భక్తులు ఉపవాస దీక్షలుబూని, ప్రత్యేక పూజలు, అర్చనలు, జాగరణలు చేస్తున్నారు. రుద్రాభిషేకాలు, శివ కల్యాణాలు, జపాలు, స్తోత్రాలు, కీర్తనలు అఖండ దీపారాధనలు, బిల్వ దళార్చనలు, నమక చమక పారాయణలతో ఆలయం శోభిల్లుతోంది. స్వామివారికి గర్భాలయంలో మహాన్యాస పూర్వక అభిషేకంతో పాటు ప్రత్యేక విశేష పూజలు చేస్తున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మల్లన్న ఆలయంలో పెద్ద పట్నం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. 46 వరుసలతో పంచ రంగులతో పసుపు, కుంకుమ, తెల్ల పిండి , పచ్చ సునేరుతో ఓగ్గు పూజారులు పట్నాన్ని వేశారు. ఈ పట్నంపై నడిచి శివసత్తులు, మల్లన్న భక్తులు తమ భక్తి ప్రపక్తులు ప్రదర్శిస్తున్నారు. పెద్దపట్నం సందర్భంగా తోటబావి ప్రాంగణాన్ని బారికేడ్లతో పకడ్బంధీగా తీర్చి దిద్దారు. ఈ సందర్భంగా షామియానాలు, చలువ పందిళ్ళు, ప్రత్యేక క్యూ లైన్ లు ఏర్పాటు చేసి భక్తులకు ఏ ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కాకతీయుల విజయానికి చిహ్నంగా నిర్మించిన మహత్తర ఆలయం శివకేశవాలయం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి చిక్లీ నదీ తీరాన ఈ శివకేశవాలయం నిర్మితమైంది. ఈ ఆలయంలో శివకేశవులతో పాటు, రేణుకామాత విగ్రహాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణం పరిశీలిస్తే ఆనాటి శిల్పకళా వైభవం ఉట్టిపడుతుంది. ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడాది మహాశివరాత్రి వేడుకలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని చికిలీ నదీ తీరాన శివరాత్రి జాతర, రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.
కాకతీయుల కాలం నాటినుంచి భక్తుల కొంగుబంగారంగా నిలుస్తున్న శివకేశవాలయం శిథిలావస్థకు చేరుకోవడం పై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ పట్టించుకోక పోవడంతో గ్రామస్థులు చందాల రూపేణా 40 లక్షల రూపాయలు పోగు చేసి మరమ్మతులు చేపట్టారు. నది ప్రవాహానికి కోతకు గురికాకుండా చుట్టూ భారీ ప్రహరీ నిర్మించి ఆలయాన్ని రక్షించుకున్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్న వేడుకలకు వాంకిడి నుంచే కాక చుట్టుపక్కల మండలాలైన కెరమెరి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మహరాష్ట్ర నుంచి సైతం భారీసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మహాశివరాత్రి సాయం సంధ్యా సమయంలో ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి చిక్లీ నదీ తీరంలో రథోత్సవ వేడుక ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ జాతర వేడుక ఘనంగా ప్రారంభమైంది.
ఇదే రీతిలో ఎన్నో శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఓం నమఃశ్శివాయ, హర హర మహదేవ శంభో శంకర, భక్త వరదా పాహిమాం, పాహిమాం, రక్షమాం, రక్షమాం …అంటూ శరణ ఘోష చేస్తూ భక్తులు మహాశివరాత్రి వేడుకలను మహోన్నత రీతిలో నిర్వహించుకుంటున్నారు.