గ్రేటర్ హైదరాబాద్‌లో 3వేల ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి..కాలుష్యానికి అడ్డుకట్ట వేస్తామన్న గత ప్రభుత్వ మాటలు మాటలుగానే మిగిలిపోయాయి. తాజాగా సీఎం రేవంత్ వచ్చే రెండు సంవత్సరాలలో 3వేల ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తామని ప్రకటించారు. కాలుష్యంలో హైదరాబాద్‌ను మరో ఢిల్లీలా కాకుండా 3వేల ఎలక్ట్రిక్ బస్సులతో హైదరాబాద్‌లో కాలుష్యానికి చెక్ పెడతామని సీఎం చెప్పారు.
—
రాష్ట్రంలో మొదటిసారి 2019లో తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నుంచి వివిధ రూట్ల నుంచి శంషాబాద్‌కు మొదట్లో ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ నడిపింది. 40 బస్సులతో మొదలైన హైదరాబాద్ ఎలక్ట్రిక్ బస్సుల ప్రయాణ ప్రస్తుతం 160 వరకు చేరింది. గాలి, శబ్ద కాలుష్యాలు చేయకుండా వెళ్లడం ఈ ఎలక్ట్రిక్ బస్సుల ప్రత్యేకత. ప్రస్తుతం హైదరాబాద్‌లో 2వేల 500 ఆర్టీసీ బస్సులు తిరుగుతుంటే..ఇందులో ఏసీ, నాన్ ఏసీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో ఆర్డినరీ ఎలక్ట్రిక్ బస్సులు పొగా 80 శాతం వరకు డీజీల్ బస్సులే ఉన్నాయి. ఇక ఈ డీజిల్ బస్సులనే ఔటర్ రింగు రోడ్డు బయటకు పంపించి, సిటీలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను తిప్పుతామని సీఎం రేవంత్ తెలిపారు.
సిటీలో పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తామంటున్న..ప్రభుత్వ నిర్ణయాల మీద ఆర్టీసీ యూనియన్ నాయకులు అనేక అనుమానాలను తెలియజేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులను అద్దె రూపంలో కాకుండా ఆర్టీసీ సొంతగా నడిపించాలని, లేకపోతే ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతుందనీ అంటున్నారు. కోటి మందికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ సిటీలో లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల ద్వారానే ప్రయాణం సాగిస్తున్నారు. 4 వేలకు పైగా బస్సులు తిరగాల్సిన హైదరాబాద్‌లో ప్రస్తుతం 2వేల 500 మాత్రమే తిరుగుతున్నాయని చెప్పారు.