త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామని, కాంగ్రెస్ ఘన విజయానికి పార్టీ నేతలంతా కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, 23 మంది పీఏసీ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఏడాది పాలన, మంత్రులు, ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్, స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్టీ కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు.
కాంగ్రెస్ ఏడాది పాలనపై నేతల అభిప్రాయాన్ని కేసీ వేణుగోపాల్ తెలుసుకున్నారు. సంవత్సరం పాలనపై టీపీసీసీ చేసిన సీక్రెట్ సర్వేపై పీఏసీలో సభ్యులంతా చర్చించారు. అనంతరం ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 55వేల 143 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశామని… 21 వేల కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి 12 వేల చొప్పున ఇవ్వబోతున్నామన్నారు.
ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు అన్ని స్థాయుల్లోని నేతలు, ప్రజాప్రతినిధులు వివరించాలని సూచించారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి మాజీ ప్రధాని మన్మోహన్ మృతికి సంతాపం తెలిపి… ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ ఏర్పాటైందని.. పాతబస్తీలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌కి మన్మోహన్ పేరు పెట్టామని రేవంత్‌రెడ్డి వివరించారు.